ఆత్మహత్య సమస్యకు పరిష్కారాన్ని చూపలేదు. కానీ, ఆత్మహత్యే ఓ సమస్యగా మారిపోతుంది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చావునే అంతిమ పరిష్కారంగా భావించారు.
ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు అన్నవి సర్వసాధారణం. ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీవితం సాఫీగా సాగటం అన్నది.. రాయిలా బతకటం లాంటిది. అయితే, అందరికీ అన్ని కష్టాలను భరించే శక్తి ఉండదు. నిజానికి తమకు వచ్చే కొన్ని కష్టాలను భరించే శక్తి తమకు లేదని కొందరు భావిస్తూ ఉంటారు. సమస్యలతో పోరాడే శక్తి, ధైర్యం లేక ఆత్మహత్యను ఆశ్రయిస్తుంటారు. అయితే, చావటం కోసం చూపిన ధైర్యాన్ని బతకటం కోసం పెడితే.. ఎంతటి కష్టమైనా సలామ్ చేస్తుందని భావించటం లేదు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య కూడా బతకటం కోసం కంటే చావటానికే తెగువ చూపించాడు. ఆదివారం నెల్లూరులోని ఓ హోటల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోలో అప్పుల కారణంగానే తాను చనిపోతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక, ఆత్మహత్యలు చేసుకునే వారికి ఒక్కోరికి ఒక్కో బలమైన కారణం ఉంటుంది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే వారు కొందరైతే.. బాగా ఆలోచించి.. ఓ పథకం ప్రకారం ఆత్మహత్య చేసుకునే వారు మరికొందరు. అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఎలా ఆలోచిస్తారు? ఆ ఆలోచన బలంగా మొదలైనపుడు వారిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? వారు చనిపోవటానికి ముందు ఏం జరుగుతుంది?..
ఆత్మహత్య చేసుకోవాలన్న భావన ఎప్పుడైనా కలగవచ్చు.. ఇందుకు వయసుతో సంబంధం లేదు. ఆడ, మగ అన్న తేడా కూడా ఉండదు. ఓ సమస్య విషయంలో తీవ్ర ఒత్తిడికి గురైనపుడు.. ఆ సమస్య ద్వారా తీవ్రమైన ఇబ్బంది కలిగినపుడు.. ఆ సమస్యకు అసలు పరిష్కారం లేదని అనుకున్నపుడు.. ఆ సమస్య నుంచి తప్పించుకోలేను అని వ్యక్తులు భావించినపుడు.. చనిపోతే మంచిదనిపిస్తుంది. అదే అంతిమ పరిష్కారంగా తోస్తుంది. ఇలా అనిపించడానికి మానసికంగా, శారీరకంగా చాలా కారణాలు ఉంటాయి.
ప్రపంచంలో మానసిక రోగాల కారణంగా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి మరణాలే చాలా ఎక్కువ. ప్రతీ ఏటా మానసిక రోగాల కారణంగా దాదాపు 9.5 శాతం నుంచి 24.9 శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానసిక రోగాల్లో డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, స్క్రిజోఫ్రేనియా వంటివి ఉన్నాయి. వాటిలో కూడా డిప్రెషన్ కారణంగా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పర్సనాలిటీ డిజార్డర్‌ల వల్ల కూడా ఏటా 7 నుంచి 50 శాతం మంది ఆత్మహత్యలకు యత్నిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది.
వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడటానికి గల కారణాల్లో శారీరక ఇబ్బందులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ధీర్ఘకాలిక రోగాలు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా పెద్ద సంఖ్యలో జనం ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. తరచుగా నొప్పులు రావటం కూడా ఆత్మహత్యకు యత్నించటంలో ప్రధాన పాత్రపోషిస్తోంది. కడుపు నొప్పి భరించలేక చనిపోయిన కేసులు కూడా దేశంలో చాలా ఉన్నాయి.
ఓ సారి ఆత్మహత్య చేసుకోవాలని బలమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. బలమైన కోరికను ప్రేరేపించే కొన్ని రకాల హార్మోన్స్ బాగా పని చేస్తాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో హార్మోన్లు మరింత బలంగా పనిచేస్తాయి. ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారి చివరి క్షణం ఓ పోరాటం లాగా గడుస్తుంది. వారి జీవితంలోని ముఖ్యమైన వాళ్లు కళ్లముందు కదలతారు. ఆత్మహత్య చేసుకోవటం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని అర్థం అవుతుంది.
అయినా.. చావాలనే బలమైన కోరిక వాటిని పట్టించుకోకుండా చేస్తుంది. అయితే, అత్యంత కొద్ది మంది మాత్రమే చివరి నిమిషంలో చావును వద్దనుకుంటారు. మిగిలిన వారు ఆత్మహత్యకు పాల్పడతారు. ఆత్మహత్యకు యత్నించిన వారందరూ చావాలని ఏమీ లేదు. కొందరు ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. వీరిలో కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలన్న భావనకు దూరంగా ఉంటే.. మరికొంతమంది అదే ఆలోచనతో తరచుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.