తిండి తినటంలో మనం చేసే పొరపాట్లు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. అన్నదే కాదు ఎలా తింటున్నాం అన్నది కూడా ముఖ్యమే. కొంతమంది చేతిని కడుక్కోవటం ఇష్టం లేకో.. వేరే కారణాల వల్లో స్పూనుతో భోజనం చేస్తూ ఉంటారు. ఇలా స్పూనుతో భోజనం చేయటం మంచిదేనా? లేక చెయ్యితో భోజనం చేస్తే మంచిదా.. ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయులు చేత్తో తిండి తినటం అన్నది కొన్ని వేల ఏళ్లుగా జరుగుతోంది. ఇది కేవలం మన సంప్రదాయం మాత్రమే కాదు.. సైన్స్‌తో ముడిపడి ఉన్న అంశం కూడా. అయితే, కొంతమంది కొన్ని కారణాల వల్ల చేత్తో తినటం మానేసి, స్పూన్‌తో తినటం అలవాటు చేసుకుంటున్నారు. స్పూన్‌తో తినటమే ఈజీ అన్న అభిప్రాయానికి వచ్చారు. ఇలా చేయటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చేత్తో తిండి తినటమే అన్ని రకాలుగా మేలు. ఇలా చేత్తో తిండి తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేంటంటే..
చెయ్యికి సరైన వ్యాయామం..
చేత్తో అన్నం తినటం అన్నది చెయ్యికి ఓ అద్భుతమైన వ్యాయమంలా పనిచేస్తుంది. చెయ్యిలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అన్నాన్ని కలపటం, చేత్తో చిన్న చిన్న ముద్దలుగా చేయటం వంటివి చేయటం వల్ల చేతిలోని జాయింట్లు, వేళ్లను బాగా కదిలేలా చేస్తుంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే హ్యాండ్ ఎక్సర్‌సైజ్ లాంటిది.
తగినంత ఆహారం తీసుకోవటం..
చేత్తో తిండి తినటం అన్న పద్దతి.. స్పూన్‌తో తిండి తినే పద్దతి కంటే చాలా నెమ్మదైన ప్రక్రియ. దీని వల్ల మనం ఎక్కువ సేపు ఆహారాన్ని నములుతూ ఉండాల్సి వస్తుంది. అంతేకాదు! స్పూన్‌తో తినే దానికంటే తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దీని వల్ల అవసరానికి మించి లావు పెరగటం, ఇతర సమస్యలు తగ్గుతాయి.
ఆహారానికి.. శరీరానికి మధ్య బంధం..
భారతీయ సంప్రదాయంలో చేత్తో తిండి తినటం అన్నది అతి పురాతనమైనది. కింద కూర్చోవటం, పద్దతిగా చేత్తో తిండిని ముట్టుకుని తినటంలో సైన్స్ దాగి ఉంది. ఆహారాన్ని చేత్తో ముట్టుకున్నపుడు ఆహారంతో మనకు ఓ బంధం ఏర్పడుతుంది. స్పర్శ కారణంగా మన మెదడులోకి కొన్ని సూచనలు వెళతాయి. తద్వారా పొట్టలో అవసరమైన జీర్ణ రసాలు ఊరుతాయి. ఇలా జీర్ణ రసాలు ఊరటం వల్ల జీర్ణ ప్రక్రియ మంచిగా జరిగి, తిన్న తిండి త్వరగా జీర్ణమై ఒంట బడుతుంది.
మంచి జీర్ణక్రియ
మన చేతిలో, పొట్టలో, పేగుల్లో పలు రకాల మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి మనల్ని అనారోగ్యాలనుంచి రక్షిస్తూ ఉంటాయి. చేత్తో తిండి తినటం వల్ల మంచి బ్యాక్టీరియా చేతిలోంచి పొట్టలోకి వెళుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ రక్షింపబడుతుంది. అంతేకాదు! చెడు బ్యాక్టీరియా ద్వారా అనారోగ్యం రాకుండా కూడా ఉంటుంది. అయితే, తిండి తినేటప్పుడు శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి. లేదంటే చెడు బ్యాక్టీరియా శరీరంలోకి వెళుతుంది.
టైప్ 2 డయాబెటీస్ నుంచి రక్షణ
స్పూన్‌తో భోజనం చేస్తున్నపుడు వెంట వెంటనే తినేయటం జరుగుతుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ ఇన్‌బ్యాలెన్స్‌కు దారి తీస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్‌ను కలుగజేస్తుంది. త్వరగా భోజనం ముగించే వారికి త్వరగా టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని.. క్లినికల్ న్యూట్రిషన్ అనే జర్నల్ పేర్కొంది. చేత్తో నిదానంగా తిండి తినటం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువని తేలింది.