ఈ ప్రపంచంలో స్నేహం అనే బంధానికి ఎంతో విలువ ఉంది. స్నేహితులు లేని మనుషుల జీవితం వ్యర్థం అని అంటూ ఉంటారు. స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఇలా ఎదుటి వ్యక్తితో మనకున్న ర్యాపోను బట్టి వాళ్ల హోదా నిర్ణయించబడుతుంది. మనకు అన్ని వేళలా.. కష్టనష్టాలలో తోడుండే వారిని ప్రాణ స్నేహితులు అంటారు. ఇలాంటి వారు కాని వారే ఉత్తి స్నేహితులు. అయితే, నూటికి, తొంభై శాతం మంది మనుషులు స్నేహితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారిని ఎక్కువగా ఇంటికి తీసుకెళుతూ ఉంటారు. పెళ్లయిన వ్యక్తులు కూడా ఇలా చేస్తుంటారు. అయితే, చాలా సందర్భాల్లో ఇవే కుటుంబంలో అలజడికి దారి తీస్తున్నాయి. కొంతమంది ఫ్రెండ్ కుటుంబాన్ని తమ కుటుంబంలా చూడటం లేదు.
ఫ్రెండ్ భార్యతో సహా వారి ఇంట్లోని ఆడవాళ్లను తప్పుడు ఉద్ధేశ్యంతో చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఫ్రెండ్‌ను నమ్మిన వ్యక్తి దారుణమైన మోసానికి గురికాబడుతున్నాడు. అయితే, ఇలాంటి ఫ్రెండ్స్‌ను నమ్మిమోసపోకుండా ఉండాలంటే వారి ప్రవర్తనను ముందే గుర్తించి, హద్దుల్లో పెట్టడం ముఖ్యమని ప్రముఖ సైకాలజిస్ట్ వాసవి తెలిపారు. ఫ్రెండ్స్‌ను ఇంట్లోకి తీసుకెళ్లటంపై ఆమె మాట్లాడుతూ… ‘‘కొంతమంది ఫ్రెండ్స్ భార్యలను తప్పుడు దృష్టితో చూస్తూ ఉంటారు. అలాంటి వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. అలాంటి వాళ్లకు వావి వరసలు అంటూ ఉండవు.
ఫ్రెండ్ చెల్లెలు, తల్లి ఇలా ఎవరినైనా అదే దృష్టితో చూస్తారు. వాళ్లకు ఆడది అన్న ఎలిమింట్ ఉంటే చాలు.. వావి వరసలు అవసరం లేదు. ఇలాంటి వాళ్లు ఫ్రెండ్ సిస్టర్‌కు ప్రమాదం అంటే వెళ్లరు. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు వాళ్లను కలవటానికి వెళతారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాంటి వాళ్లతో ఉండకుండా ఉంటే బెటర్. సాధారణంగా కొంతమంది మగాళ్లు పక్క అమ్మాయిల గురించి, హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ, ఫ్రెండ్స్ భార్యల గురించి మాట్లాడరు. అలా మాట్లాడుతున్నారంటేనే అర్థం అయిపోతుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్లినపుడు కూడా అలాంటి ఉద్ధేశ్యంతోనే అతడి భార్యను చూస్తారు.
అదే పనిగా ఏదో సాకుతో ఇంటికి తరచూ వస్తూ ఉంటారు. ఫ్రెండ్‌తో ఉండటం కంటే అలాంటి వ్యవహారాలు నడిపించటానికే ప్రయత్నిస్తుంటారు. పాత కాలంలో ఫ్రెండ్స్‌ను ఇంటివరకు రానివ్వద్దని అనేవారు. ఇందుకు ఇదే ప్రధాన కారణం. ఇలాంటివి జరుగుతాయనే ఉద్ధేశ్యంతో పెద్దలు వద్దని అనేవారు. ఏది మంచి, ఏది చెడు అని చూసుకువెళ్లటమే నీతి. ఓ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచే ముందే అతడి గురించి బాగా స్టడీ చేయాలి. అలాంటి వారి మైండ్‌సెట్ గురించి ఆలోచించాలి. ఇంటికి పిలిచిన తర్వాత ఇబ్బందులు తప్ప, ప్రశాంతత ఉండదు. ఇలాంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది’’ అని స్పష్టం చేశారు.