డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు జనం. డబ్బు పిచ్చిలో బంధాలు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. జల్సాలు, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రుల్ని, భార్య, పిల్లలు చివరకు తనను ఎంతో నమ్మే స్నేహితుల్ని కూడా మోసం చేస్తున్నారు.
నేడు రూపాయి ఎంతటి పనైనా చేయిస్తుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు జనం. డబ్బు పిచ్చిలో బంధాలు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. జల్సాలు, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రుల్ని, భార్య, పిల్లలు చివరకు తనను ఎంతో నమ్మే స్నేహితుల్ని కూడా మోసం చేస్తున్నారు. బీమా డబ్బులు కోసం ఓ వ్యక్తి చేసిన పని వింటే ఆశ్చర్య పోవడం ఖాయం. అతడికి భార్య సహకరించడం మరింత విడ్డూరం. వ్యాపారంలో నష్టపోయిన.. అప్పులు చేసి కూరుకుపోయిన ఓ వ్యాపార వేత్త.. చివరకు తన మీద ఉన్న బీమా సొమ్ము కోసం పెద్ద డ్రామా చేసి.. ఇరుక్కుపోయాడు. స్నేహం ముసుగులో దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకు ఏం జరిగిందంటే.?
బీమా డబ్బులు కోసం.. స్నేహితుడ్నే కడతేర్చి.. తాను చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేయసాగాడు. అయితే స్నేహితుడి భార్య.. భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురు ప్రీత్ సింగ్, ఖుష్ దీప్ సింగ్ భార్యా భర్తలు. అయితే గురు ప్రీత్ వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడు. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డబ్బులు అవసరం నేపథ్యంలో తన మీద ఉన్న రూ. 4 కోట్ల బీమా సొమ్మును కాజేసేందుకు కుట్ర పన్నాడు. ఇందుకు తన భార్య ఖుష్ కూడా సహకరించింది. సుఖ్వీందర్ సింగ్ సంఘా, జస్పాల్ సింగ్, దినేష్ కుమార్, రాజేష్ కుమార్‌లతో కలిసి పన్నాగం పన్నాడు.
అయితే ఈ పథకంలో భాగంగా సైన్‌పూర్‌కు చెందిన సుఖ్‌జీత్‌తో స్నేహం పెంచుకున్నాడు. ఈ నెల అతడిని బయటకు తీసుకెళ్లిన గురు ప్రీత్.. సుఖ్ జీత్‌తో తాగిన తర్వాత, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే తన దుస్తులు.. సుఖ్ జీత్‌కు మార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అతడిని రోడ్డుపై పడేసి ట్రక్కుతో తొక్కించాడు. తన భర్తే చనిపోయినట్లు నమ్మించి.. అతడికి దహన సంస్కారాలు చేసేసింది భార్య ఖుష్ దీప్. బీమా డబ్బుల కోసం క్లెయిమ్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా ఈ నెల 20న గురు ప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే సుఖ్ జీత్ భార్య ఈ నెల 19న ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
పాటియాలా రోడ్డులో సుఖ్ జీత్ మోటారు సైకిల్, చెప్పులు కనిపించడంతో తొలుత ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు పోలీసులు. అయితే మృతుడి భార్య.. గురు ప్రీత్ మీద అనుమానం వ్యక్తం చేసింది. అయితే గురు ప్రీత్ కుటుంబ సభ్యులను అడగ్గా.. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. వారిదైన స్టైల్లో విచారించగా.. రూ. 4 కోట్ల బీమా కోసం స్నేహితుడ్ని.. నలుగురి సాయంతో హత్య చేసినట్లు తెలిపారు. చివరకు భర్త మృతదేహాన్ని భార్య గుర్తించిందని పోలీసులు తెలిపారు. దీంతో గురు ప్రీత్, ఆయన భార్య, వారికి సహకరించిన వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.