ఇంటర్ తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అపారం. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాఉంటాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటే.. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు లేదా సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి పైచదువులు పూర్తిచేయవచ్చు. లేదు విద్యతో పాటు ఉపాధి కావాలనుకుంటే రక్షణ రంగాల వైపు అడుగులు వేయటం ఉత్తమం.
ఇండియన్ నేవీ – 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారు కేరళలోని ఎజిమల నేవల్ అకాడమీలో ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం నేవీలోనే ఉన్నత హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ సమయంలో చదువుతో పాటు భోజన, వసతి సౌకర్యాలు పూర్తిగా ఉచితం. చక్కటి శిక్షణ, ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి పట్టా, ఎంచుకున్న కోర్సు పూర్తికాగానే ఉన్నతస్థాయి ఉద్యోగంలోకి అడుగుపెట్టవచ్చు. రక్షణ దళాల్లో ఉన్నత ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం..
ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పీసీ) – జులై 2023
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఏదేని బోర్డు నుండి ఇంటర్(ఎంపీసీ) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. పదో తరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే, జేఈఈ మెయిన్స్ లో ర్యాంకు తప్పనిసరి. జేఈఈ మెయిన్-2022లో అర్హత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 02.01.2004 నుంచి 01.07.2006 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్.
ఎంపిక విధానం: మొదట జేఈఈ ర్యాంకుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అనంతరం వివిధ రకాల పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు, ఫిజికల్ టెస్టు, వైద్య ఆరోగ్య పరీక్షల ఆధారంగా అర్హులకు అవకాశం కల్పిస్తారు.
శిక్షణ: ఎంపికైన వారికి జూన్ 2023 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. బీటెక్ స్పెషలైజేషన్లుగా.. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బ్రాంచులు ఉంటాయి. ఈ సమయంలో చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు… అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ-న్యూఢిల్లీ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం వీరు సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ నేవీలో విధుల్లోకి చేరతారు.