అతడేమీ అనామక బౌలర్ కాదు.. అలాగని వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా కాదు. కానీ పరిస్థితులకు తగ్గట్లు జట్టుకు విజయాలు అందించగలడు. ఇక బాల్ ను స్వింగ్ చేయడంలో అతడు ఏ మాత్రం దిగ్గజ బౌలర్లకు తీసిపోడు. పైగా వెస్టిండీస్ దిగ్గజం, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ కు అతడంటే వణుకు. ఐపీఎల్ లో అలవోకగా సిక్స్ లు బాదే గేల్.. అతడి బౌలింగ్ లో మాత్రం ఆచితూచి ఆడతాడు అంటే అతిశయోక్తికాదు.. ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడు ఇంతకీ ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా? ఆ అనామక వరల్డ్ క్లాస్ ప్లేయర్ సందీప్ శర్మ. ఐపీఎల్ లో ఎక్కువ మెయిడిన్ ఓవర్లు వేసిన ప్లేయర్ల జాబితాలో 6వ స్థానంలో నిలిచి రికార్డ్ సృష్టించాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ 2023 వేలంలో కొనుగోలు చేయకుండా మగిలిపోయిన ఆణిముత్యం లాంటి బౌలర్. తాజాగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
సందీప్ శర్మ.. IPLలో పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బంతులు వేసి, వికెట్లు తీయడంలో సిద్దహస్తుడు. ఇన్ స్వింగ్.. ఔట్ స్వింగ్ లతో బ్యాట్స్ మెన్ లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. ఒకప్పుడు బూమ్రా కంటె బెస్ట్ బౌలర్ గా పేరుగాంచాడు. కానీ నేడు ఎవరూ కొనుగోలు చేయని ఓ అనామక ఆటగాడిగా మిగిలిపోయాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున సత్తా చాటిన ఇతడిని, కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకురాలేదు. కేవలం రూ.50 లక్షల బేస్ ప్రైస్ తోనే వేలంలోకి వచ్చిన ఇతడిని.. కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. ఇది తననెంతో ఆవేదనకు గురిచేసిందని సందీప్ శర్మ వాపోయాడు. ఇక తనను కొనకపోవడంపై ఈ విధంగా స్పందించాడు.”నేను ఐపీఎల్ లో ఏ జట్టు తరపున ఆడినా గానీ మంచి ప్రదర్శనే ఇచ్చాను. అయినా గానీ నన్ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం నన్నెంతో బాధకు గురిచేసింది. ఎక్కడ తేడా కొట్టిందో కూడా నాకు తెలియడం లేదు. పైగా ప్రస్తుతం దేశవాలీ క్రికెట్లో నేను బాగానే రాణిస్తున్నాను. రంజీ ట్రోఫీ చివరి రౌండ్ లో సైతం నేను 7 వికెట్లతో సత్తాచాటాను” అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చాడు సందీప్ శర్మ.
ఇక సందీప్ శర్మ గణంకాలను చూస్తే.. ఒకానొక దశలో బూమ్రా కంటే బెస్ట్ టీ20 బౌలర్ గా ప్రసిద్దికెక్కాడు. వివిధ ఐపీఎల్ టీమ్ లకు ఆడిన సందీప్ శర్మ.. మెుత్తం 104 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. అద్భుతమైన 7.76 ఎకానమీతో 114 వికెట్లను నేలకూల్చాడు. ఐపీఎల్ లో బూమ్రా ఎకానమీ కూడా 7.4 గా ఉండటం గమనార్హం. 2022లో పంజాబ్ కు ఆడిన సందీప్ శర్మను ఈ సారి మాత్రం కొనుగోలు చేయడానికి ఏ జట్టు ముందుకురాలేదు. అయితే గత కొంత కాలంగా సందీప్ శర్మ ఏ ఫార్మాట్ లోనూ జట్టులో లేకపోవడం ఇతడికి మైనస్ గా మారింది. అదీకాక ఫ్రాంఛైజీలు అన్ని ఆల్ రౌండర్స్, విదేశీ బౌలర్లపై ఆసక్తి చూపించడంతో సందీప్ శర్మ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.