రోజు రోజుకి గుండెపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు చిన్న వయసు వాళ్లు కూడా ఈ గుండెపోటు తో మరణిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా గుండెపోటుకు కరోనా టీకాలు కారణమంటూ కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది. అయితే వాటిలో అసలు నిజం ఎంత ఉంది? వైద్యలు ఏం చెబుతున్నారు?
గుండెపోటు.. ఈ మాట వింటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పే పరిస్థితి కూడా లేదు. చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలు చూసి ప్రజలు అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు కొత్తగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ గుండెపోటు ఎక్కువగా వస్తోంది. అనే వాదనలు వినిపిస్తున్నాయి. కొవిడ్ టైమ్ లో ఎవరైతే టీకాలు తీసుకున్నారో.. అలాంటి వారే గుండెపోటుతో మరణిస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారాలు కూడా మొదలు పెట్టారు. అయితే అందులో ఎలాంటి నిజంలేదు. అసలు గుండెపోటుతో చనిపోయిన వారి లెక్కలు చూస్తే ఆ విషయం ఎంత తప్పో మీకే అర్థమవుతుంది.
గుండెపోటు మరణాలు పెరగిపోతున్నాయనే భయంతో ప్రజలు లేనిపోని అపోహలను పెంచుకుంటున్నారు. కొందరైతే కరోనా వ్యాక్సిన్ కారణంగానే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. కరోనా టీకా, ఆ సమయంలో వాడిన స్టెరాయిడ్స్ వల్లే గుండెపోటు వస్తోందా? అసలు వైద్యులు ఏమంటున్నారో చూద్దాం. సాధారణంగా వయసు పైబడిన వారిలో రక్తనాళాలు మూసుకుపోయి క్రమంగా చిన్నవి అయిపోవడం వల్ల నొప్పి వచ్చి ఆ తర్వాత గుండెపోటు వస్తుందట. అయితే యువతలో మాత్రం రక్తనాళాలు సడెన్ గా బ్లాక్ అవ్వడం వల్ల ఈ గుండెపోటు వస్తున్నట్లు చెబుతున్నారు. అలా కుప్పకూలిన వారికి 3 నిమిషాల్లో షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వగలిగితే కాపాడుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
అయితే యువతలో క్లాట్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయట. విపరీతమైన ధూమపానం, డ్రగ్స్ అలవాటు, ఆహారపు అలవాట్ల కారణంగా కాడా గుండెపోటు వచ్చే అకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇంక కోవిడ్ విషయానికి వస్తే.. కరోనా కారణంగా కూడా గుండె, బ్రెయిన్‌లో క్లాట్స్ ఏర్పడి.. హార్ట్ ఎటాక్, పెరాలసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. కాకపోతే ఏవైనా సమస్యలు వస్తే అవి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 3 నెలల్లోపే వస్తాయని తెలిపారు. కోవిడ్ బారిన పడితే 6 వారాల వరకే దాని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. చాలా మంది కోవిడ్ తర్వాత 3 నెలలు టాబ్లెట్స్ వాడకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని తెలియజేశారు.
కరోనా తగ్గి 6 నెలలు కావొస్తోంది.. ఇప్పుడు దాని వల్ల గుండె పోటు వస్తుంది అనడానికి ఏమాత్రం అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇంక గుండెపోటు మరణాల నివేదికలు వయసుల వారీగా తీసుకుంటే.. 2017లో 14 ఏళ్లలోపు పిల్లలు గుండెపోటుతో 74 మంది చనిపోయారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారు 122 మంది, 18-30 మధ్య 2,087, 30-45 మధ్య 6,764 మంది, 45 నుంచి 60 మధ్య వయసు కలిగన వారు 9,173 మంది, 60 పైబడిన వారు 5,026 మంది గుండెపోటుతో చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్క 2017 సంవత్సరంలోనే గుండెపోటుతో అన్ని వయసుల వారు కలిపి మొత్తం 23,246 మరణాలు సంభవించాయి.
అలా 2018లో 25,746, 2019లో 28,005, 2020లో 28,680, 2021లో 28,449 గుండెపోటు మరణాలు సంభవించాయి. ఈ అన్ని సంవత్సరాల్లో కూడా 14 ఏళ్లలోపు వారి నుంచి 60కి పైబడిన వారి వరకు అందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చిన్న వయసు వారు గుండెపోటుతో చనిపోతున్నారు అనడానికి లేదు. అంతేకాకుండా కరోనా కంటే ముందు కూడా గుండెపోటుతో చాలానే మరణాలు సంభవించాయి. ఇప్పుడు కొత్తగా గుండెపోటుకు కరోనా టీకా కారణం అని భ్రమలు వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల గుండెపోటుకు దూరంగా ఉండచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.