శీతాకాలంలో అందరూ.. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య కఫం. సైనటైసిస్ ఉన్న వారికి కాస్త చల్లగాలి తగిలినా, మంచినీళ్లు కాస్త ఎక్కువగా తాగినా,పెరుగు,మజ్జిగ లాంటి చల్లటి పదార్ధాలు తీసుకున్నా, సొరకాయ తిన్నా వెంటనే కఫం పట్టి, తుమ్ములు,దగ్గు రావడం జరుగుతుంది. అయితే, సైనటైసిస్ లేకపోయినా కొందరిని కఫం సమస్య ఇబ్బంది కొందరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కఫం సమస్య ఉన్నవాళ్లు రాత్రి పూట పెరుగు, మజ్జిగ లాంటివి తినకపోవడమే మంచిది. ఈ సమస్య ఉన్నవాళ్లకు ఒక మంచి పరిష్కారం మిరియాల కషాయం. ఈ మిరియాల కషాయం తీసుకోవడం వల్ల కఫం సమస్య నుంచి బయట పడొచ్చు. అయితే, ఈ మిరియాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సినవి: రెండు కప్పుల నీళ్లు, టీ స్పూన్ బెల్లం, టీ స్పూన్ మిరియాల పొడి, టీ స్పూన్ అల్లం తరుగు, టీ స్పూన్ నెయ్యి, గుప్పెడు తులసి ఆకులు, రెండు లవంగాలు సిద్దం చేసుకోవాలి. ఇలా సిద్దం చేసుకున్న ఐటమ్స్ తో కషాయం ఎలా చేసుకోవాలన్న విషయం గురించి తెలుసుకుందాం..
తయారీ విధానం: నెయ్యి వేడి చేసి, లవంగాలు, అల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు వేసి వేయించాలి. చిటపటలాడాక నీళ్లు, బెల్లం వేసి కలపాలి. మీడియం మంట మీద పదిహేను నిమిషాలు మరిగించాలి. తర్వాత కొద్దిగా చల్లార్చి, వడగట్టి, గోరువెచ్చగా తాగాలి. ఈ కషాయాన్ని రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.
ఒకవేళ మరీ వేడి చేస్తుంది అనుకుంటే ఈ మిశ్రమంలో కొంచెం పట్టిక బెల్లం వేసుకుని తాగాలి. దీని వల్ల వేడిమి పోయి, చలువ చేస్తుంది. కఫం గొంతులో ఉండి, నసగా, విసుగుగా ఉంది అంటే.. అప్పుడు తమలపాకుల కషాయం బాగా పని చేస్తుంది. నీళ్లను బాగా మరిగించి, వాటిలో తమలపాకుల్ని కాడలు తెంపేసి, ఆ వేడి నీటిలో వేయండి. ఒక పది నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని వడబోసి, తాగండి. ఈ తమలపాకు టీ రెగ్యులర్ గా తాగితే, గొంతులో ఉన్న కఫం పూర్తిగా పోతుంది.
చిన్నపిల్లలకైతే తమలపాకు మీద కొంచెం ఆముదం రాసి, దాన్ని పొయ్యి మీద వేడి చేసి, అది మెత్తగా ఆయిన తర్వాత దాన్ని రసంగా తీసి, దానిలో చిటికెడు పటిక బెల్లం పొడి కలిపి ఇస్తే, పిల్లల గొంతులో ఉండే కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అయితే, ఈ రసాన్ని మరీ ఎక్కువగా ఇవ్వకూడదు. పరిమిత మోతాదులో.. అంటే ఒక స్పూన్ కంటే తక్కువగా ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కఫం సమస్య నుంచి బయట పడొచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.