రక్తపోటు మారుతున్న జీవన విధానం వల్లనో, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకనో ఇప్పుడు చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కొందరైతే అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. అందుకు చాలా వరకు స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే తప్పులు, నిర్లక్ష్య ధోరణి వల్లనే అధిక రక్తపోటు బారిన పడుతుంటారు. అయితే రక్తపోటు ఉన్న వ్యక్తులు ఇవి ఫాలో అయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీరు శారీరకంగా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారుతారు.
మీరు బీపీతో బాధపడుతుంటే పొగాకు జోలికి వెళ్లకండి. అది మీకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు పొగ తాగడం వల్ల బీపీ ఒక్కటే కాదు.. అధిక రక్తపోటు, గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణ వ్యక్తుల కంటే బీపీ ఉన్న వారికి పొగాకు వల్ల మరింత ముప్పు పొంచి ఉంటుంది. అందుకే పొగాకు జోలికి పోకూడదని వైద్యులు చెబుతుంటారు.
మీరు బీపీతో బాధపడుతుంటే మీ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు రావాలి. మీరు ఉప్పునకు చాలా దూరంగా ఉండాలి. ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుంది. సాధారణంగా ఉన్న వారికంటే బీపీ ఉన్నవారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. పెరుగు, మజ్జిగన్నంలో ఉప్పుని వాడకుండా ఉండటమే మంచిది. బీపీకి ఉప్పు పెద్ద శత్రువు మీరు ఉప్పు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంటుంది.
అధిక రక్తపోటు, అధిక బరువు మీకు అంత మంచిది కాదు. కాబట్టి మీరు రక్తపోటుతో బాధపడుతూ ఉంటే శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి. మీ బరువు పెరగకుండా రోజూ వ్యాయామం చేయాలి. తద్వారా మీ బీపీ కంట్రోల్ లో ఉండటమే కాకుండా మీ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఎక్కువ బీపీ ఉన్నవాళ్ల వ్యాయామం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువులు మోయడం, వేగంగా పరిగెత్తడం చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు.
బీపీ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యాన్ని నిర్దేసిస్తుంది. మీ ఆహారంలో పాలకూర, బచ్చలి కూరలను తరచుగా తీసుకోవడం చేయాలి. ఈ ఆకుకూరలను తీసుకోవడం వల్ల మీ బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. అంతేకాకుండా ఆకుకూరలు తినడం వల్ల కంటిచూపు, గుండె ఆరోగ్యంకూడా మెరుగవుతుంది.
బీపీని కంట్రోల్ చేసేందుకు పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. రోజుకో అరటిపండు తీసుకున్నా కూడా బీపీని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అందులో ఉండే పొటాషియం మీ బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే కివీ ఫ్రూట్, ఆవకాడో జూస్ కూడా మీ రక్తపోటుని కంట్రోల్ చేసేందుకు సహాయపడతాయ. ఖరీదైన పండ్లు కాకపోయినా రోజుకో అరటిపండు తినడం అలవాటు చేసుకోండి.
ఇలా మీ జీవన విధానాన్ని మార్చుకుంటూ పోవడం వల్ల మీరు అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండగలరు. ఇంకా శరీరంలో కాస్త మార్పు కనిపించినా కూడా వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే రక్తపోటు పెరగడం వల్ల మీ ప్రాణానికే ప్రమాదం రావచ్చు. వైద్యులను సంప్రదించి మెడిసిన్ వాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచు కోవాలి. ఇలా చేయడం వల్ల మీ బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా.. రక్తపోటు పెరగకుండా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే మీరు చాలా రోగాల నుంచి తప్పించుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతుంటారు