ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, రెండేళ్ల క్రితం మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆరోగ్యం అనగానే అందరికీ సలాడ్స్ కూడా గుర్తొస్తాయి. అయితే చాలామంది ఈ సలాడ్స్ తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.
సలాడ్స్ ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో తయారు చేస్తారు. రోజుకు ఒక కప్పు సలాడ్ తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే మీ శరీరం చాలా జబ్బుల నుంచి కూడా బయటపడగలదు. సీజనల్ ఫ్రూట్స్ తో చేసే సలాడ్ మీ ఆరోగ్యాన్ని అమాంతం పెంచేస్తుంది. వైద్యులు కూడా రోజుకో కప్ సలాడ్ తినాలని సూచిస్తుంటారు. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన సలాడ్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
సలాడ్స్ లో బచ్చల కూర వంటి వాటిలో కెరోటినాయిడ్లు ఉంటాయి. సలాడ్స్ లో బచ్చలకూరను భాగం చేసుకుంటే మీ కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. కంటి చూపు మందగించిన వారికి, వయసు పైబడుతున్న వారికి ఈ బచ్చలికూర కలిపిన సలాడ్స్ మంచి ఫలితాలను ఇస్తాయి.
మీరు రోజూ తీసుకునే సలాడ్స్ లో అవిసె గింజలు, నువ్వులు, చియా గింజెలను చేర్చుకోవడం ద్వారా మీ శరీరంలో మంచి కొవ్వు చేరుతుది. అంతేకాకుండా శరీరంలో ఉండే చెడు కొవ్వును బయటకు పంపేస్తాయి. వీటిని వేయించి గానీ, నేరుగా గానీ తీసుకోవచ్చు. ఇలా రోజు మార్చి రోజు అయినా ఈ గింజలను సలాడ్స్ లో భాగం చేసుకోవచ్చు.
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో చేసిన సలాడ్స్ ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ సలాడ్స్ లో ఫైబర్, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మనిషికి గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని దాదాపుగా తగ్గిస్తాయని వైద్యులు చెబుతుంటారు. రోజుకో కప్పు సలాడ్ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు.
రోజూ సలాడ్లు తినడం అలవాటు చేసుకోవడం వల్ల మీ ఆహారపు అలవాట్లు కూడా మారే అవకాశం ఉంటుంది. సలాడ్లను తినడం వల్ల.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు కూడా పోతుందని చెబుతున్నారు. సలాడ్స్ తింటూ వ్యాయమం చేయడం వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి మీ ఆహారంలో సలాడ్లను కూడా భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా జీవించండి.