ఇంటి చిట్కాలు పాటించడం ఓ వ్యక్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపింది. దీంతో ఆయన నీలం రంగులోకి మారిపోయాడు. ఎవరా వ్యక్తి? ఏంటా కథ అంటే..!
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంటి చిట్కాలు పాటించడం మామూలే. ఇంటి చిట్కాల గురించి వార్తా పత్రికలు, వెబ్సైట్లు, టెలివిజన్లలోనూ చెబుతుంటాన్ని చూస్తుంటాం. ఫలానా వ్యాధికి ఫలానా చిట్కా పాటిస్తే తగ్గుతుందని సూచిస్తుంటారు. అదే సమయంలో ఈ చిట్కాలను ఆరోగ్య నిపుణులను సంప్రదించాకే పాటించాలని కూడా అంటుంటారు. కానీ కొందరు మాత్రం వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాడేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ చిట్కాలు పనిచేసినా.. వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ ఉదంతమే అమెరికాలో చోటుచేసుకుంది. పాల్ కరాసన్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి ఇంటి వైద్యం, డైట్‌ను అనుసరించి పూర్తిగా నీలం రంగులోకి మారిపోయాడు. పదేళ్ల కిందే ఆ వ్యక్తి వార్తల్లో నిలిచాడు. కానీ తాజాగా మరోసారి ఆయన ఫొటోలు, వీడియో నెట్టంట వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి కరాసన్ 2013లోనే చనిపోయాడు. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. డెర్మటైటీస్, కీళ్లనొప్పులు సహా ఇతర అనేక వ్యాధుల ట్రీట్మెంట్లో భాగంగా ఏళ్ల తరబడి ఇంట్లో తయారు చేసిన పోషకాహార సప్లిమెంట్‌ను పాల్ కరాసన్ తీసుకున్నాడు. అయితే దీని వల్ల దుష్ప్రభావానికి గురయ్యాడు. పోషకాల సప్లిమెంట్‌లోని సిల్వర్ ఆయన శరీర చర్మాన్ని నీలంగా మార్చింది. దీంతో ఆయన పూర్తిగా నీలం రంగులోకి మారిపోయాడు. బ్రిటన్‌కు చెందిన న్యూ ఏజ్ మ్యాగజైన్‌లో హెల్త్ టిప్స్‌ను చదివాక ఇంట్లో తయారు చేసిన సిల్వర్ క్లోరైడ్ కొల్లాయిడ్‌ను కరాసన్ తాగాడు. డెర్మటైటీస్‌తో బాధపడుతోన్న ఆయన.. తన చర్మం పొరలుగా మారకుండా సమ్మేళనం ద్రావణాన్ని ముఖంపై రుద్దుకునేవాడు.
యాసిడ్ రిఫ్లక్స్, ఆర్థరైటిస్‌తో బాధపడిన తాను ఇంటి చిట్కాల వల్లే బయటపడ్డానని అప్పట్లో కరాసన్ తెలిపాడు. ఇదే సమయంలో ఆర్గిరియా (సిల్వర్ క్లోరైడ్ వల్ల చర్మం నీలం లేదా బూడిద రంగులోకి మారిపోవడం) వ్యాధికి ఆయన గురయ్యాడు. చర్మం రంగు మారుతున్నట్లు తన ఫ్రెండ్ గుర్తించేవరకూ కరాసన్ తెలుసుకోకపోవడం గమనార్హం. చర్మం నీలం రంగులోకి మారడంతో కరాసన్ను అందరూ ‘బ్లూ మ్యాన్’, ‘పాపా స్మర్ఫ్’ అనే మారుపేర్లతో పిలిచేవారు. అయితే ఇది ఆయనకు బొత్తిగా నచ్చేది కాదు. 2013లో 62 ఏళ్ల వయసులో కరాసన్ గుండెపోటుకు గురయ్యాడు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరి, ట్రీట్మెంట్ పొందుతూ మరణించాడు.
Inside Edition Flashback: Paul Karason shocked the world when he went on national television showing his blue skin. pic.twitter.com/dPGt2xjApQ
— Inside Edition (@InsideEdition) May 31, 2019