శ్రీ మహావిష్ణువు యొక్క 23 అవతారాల్లో ఎనిమిదవ అవతారమే శ్రీ కృష్ణావతారం. శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవుడు దంపతులకు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి నాడు(8వ రోజున) కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ కృష్ణుడి పుట్టినరోజునే కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి రోజునే రోహిణి నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. నక్షత్రాలు, తిథులని బట్టే పూర్వం పుట్టినరోజులు, పండుగలు జరుపుకునేవారు. ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చాక తిథులలో తేడాలు వచ్చాయి. పుట్టిన తేదీ బట్టి పుట్టినరోజులు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. కొంతమంది మాత్రం తిథిని బట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. మరి శ్రీ కృష్ణ జన్మాష్టమి తిథుల బట్టే జరుపుకుంటున్నప్పుడు ఈ గందరగోళం ఎందుకు? అనే విషయంపై పండితులు పలు కారణాలు చెబుతున్నారు.
శైవ సాంప్రదాయం వారు, మిగిలిన వారు తిధిని బట్టి కృష్ణాష్టమి జరుపుకుంటుండగా.. వైష్ణవులు నక్షత్రం బట్టి జరుపుకుంటారు. వైష్ణవేతరులు ఆగస్ట్ 19వ తేదీన అష్టమి నాడు శ్రీ కృష్ణాష్టమి జరుపుకుంటారు. అర్చన చేయడం, ఉపవాసాలు ఉండడం, ఆరాధన చేయడం వంటివి 19వ తేదీన చేస్తారు. ఇస్కాన్ వారు కూడా ఆగస్ట్ 19నే కృష్ణాష్టమిని జరుపుకుంటున్నారు. మరుసటి రోజు అంటే ఆగస్ట్ 20న కృష్ణుడు జన్మించిన ఆనందాన్ని(కృష్ణ జయంతిని) వైష్ణవులు జరుపుకుంటారు. వైష్ణవ సాంప్రదాయంలో నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. పుట్టిన నక్షత్ర ఆధారంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. కృష్ణాష్టమి అంటే రోహిణి నక్షత్రం ఉండాలన్న నియమం వైష్ణవులది కాబట్టి వైష్ణవులు ఆగస్ట్ 20నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. అయితే 19న కృష్ణాష్టమి, 20న కృష్ణ జయంతిని జరుపుకుంటే శ్రేయస్కారం అని పండితులు చెబుతున్నారు.