కరోనా పుణ్యమా అని అయినవాళ్లు కూడా కానివాళ్లు అయిపోతున్నరు ! ఎంతటి ఆత్మీయులు దూరమైనా సరే చివరిచూపు కోసం వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నరు. వైరస్‌తో సచ్చిపోతే కనీసం పాడె మోసేందుకు కూడా నలుగురు ముందుకు రాలేని దుస్థితి వచ్చింది కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది.
మృతిచెందిన వారి అస్తికలను గంగానదిలో కలపడాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కరోనా ఆంక్షలతో అది క్లిష్టంగా మారింది. దీంతో పోస్టల్ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడి నుంచైనా అస్థికలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఓమ్ దివ్య దర్శన్ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని ఎన్జీఓ సిబ్బంది.. వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, గయాలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్ పోస్ట్ చేసేవారు ముందుగా ఓమ్ దివ్య దర్శన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్‌మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు. శాస్త్రోక్తంగా ఓమ్ దివ్య దర్శన్ సేవాసంస్థ సభ్యులు అస్థికలు నిమజ్జనం చేస్తారని కృష్ణకుమార్ యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఒక బాటిల్లో గంగానది నీటిని తిరిగి.. ఆయా కుటుంబ సభ్యులకు పోస్ట్ ద్వారా పంపిస్తారని వెల్లడించారు.