‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు. ‘యశ్చ శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః’ మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణంతోనే సకల కార్యాలు నెరవేరుతాయని చెబుతుంది స్కాంద పురాణం.
శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారమూ పవిత్రమైందే. ప్రతి తిథి విశేషమైందే. అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ నెలలో. వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే! దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. ‘అభిషేక ప్రియః శివః’ అన్నారు పెద్దలు. నిండు మనసుతో నాలుగు చెంబుల నీళ్లు పోసినా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు.
శక్తి ఉన్నవాళ్లు నిత్యం సకృద్రుద్రాభిషేకం గానీ, అతి రుద్రాభిషేకం గానీ, మహా రుద్రాభిషేకంతో గానీ ఈశ్వరుడిని అభిషేకిస్తే మేలు కలుగుతుంది. శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి. అంతేకాదు, తనకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని గానీ, ఇష్టమైన వస్తువును గానీ దానమిచ్చి వదిలిపెట్టే సంప్రదాయమూ ఉంది.
మరో అద్భుతమార్గం ఈ వీడియోలో వీక్షించండి: