ఆదివారం వస్తే సెలవు హాయిగా రెస్టు తీసుకోవచ్చు. కాస్త రిలాక్స్ కావచ్చునని పెద్దలు ఆలోచిస్తుంటారు. అలాంటిదీ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు కూడా కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. ఆ రోజంతా టీవీ చూడాలని, వీడియో గేమ్స్ ఆడుకోవాలని భావిస్తుంటారు. అయితే ఆ రోజుల్లో బడులు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటీ..?
సోమవారం నుండి శనివారం వరకు టీచర్ చెప్పే పాఠాలతో కుస్తీలు పడిన బడి విద్యార్థులు.. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కువ సేపు పడుకోవాలని, ఆడుకోవాలని భావిస్తుంటారు. ముఖ్యంగా టీవీలో రోజంతా బొమ్మలు చూడాలని, సెల్ ఫోన్లలో తమకు నచ్చిన వీడియో గేమ్స్ అన్నీ ఆడేయాలని ముందే ప్రణాళికలు వేసుకుంటారు. స్కూల్‌కి వెళ్లే చిన్నారులకు పండుగ సెలవు కన్నా ఆదివారం సెలవు రిలాక్సేషన్‌తో పాటు వారికి ఆడవిడుపుగా మారుతుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం బడి పిల్లలకు చేదు వార్త చెబుతోంది. ఇకపై వచ్చే ప్రతి ఆదివారం పాఠశాలలకు వెళ్లాలని తెలిపింది. అయితే కొన్ని పాఠశాలలకే వర్తిస్తుంది. ఇంతకు ఆ బడులేంటంటే?
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల నిమిత్తం 3,349 ప్రభుత్వ పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించింది ఏపీ సర్కార్. పరీక్షలు జరిగే ఆరు రోజుల పాటు వాటికి సెలవులు ప్రకటించింది. ఇక ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 30 మధ్య వచ్చే 6 ప్రభుత్వ హాలీడేస్‌లో తరగతులు నిర్వహించాలని తొలుత ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి చేయడంతో హాలీడేస్ బదులు ఆదివారాల్లో బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30లోపు నాలుగు ఆదివారాల్లో అనగా ఏప్రిల్ 9, 16, 23, 30 తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలని సూచించింది.
పదో తరగతి పరీక్షలు ప్రారంభం నాటి నుండే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు మొదలయ్యాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరుగుతాయి. మరోవైపు 1 నుంచి 9 తరగతులకు ఏప్రిల్ 27 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇక వారికి ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారాల్లో పిల్లలు పాఠాలు చెప్పాలని విద్యాశాఖ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.