మృత్యు భయం నుంచి, దుఃఖ బాధల నుంచి రక్షించే దక్షిణామూర్తిని ఈ శివరాత్రికి ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మేలు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. దక్షిణామూర్తి అంటే ఆ పరమేశ్వరుని అవతారం.
శివశక్తిలో శివ అంటే శివుడు, శక్తి అంటే పార్వతి. ఈ ఇరువురి సమైక్య రూపమే దక్షిణామూర్తి స్వరూపం. శివశక్తుల సమైక్య రూపమే దక్షిణామూర్తి స్వరూపం అయ్యింది. దక్షిణామూర్తి విగ్రహంలో కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా ఉంటాయి. మకర కుండలం అనేది పురుషుల అలంకారం, తాటంకం అనేది స్త్రీల అలంకారం. అందుకే దక్షిణామూర్తి అంటే శివయ్య రూపంతో పాటు, పార్వతి అమ్మ మూర్తి కూడా. లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణీ సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని అని ఉంటుంది. సనకసనందాదులకు రెండుగా కనబడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. ఆ ఏకాకృతి అలంకారమే దక్షిణామూర్తి స్వరూపం.
దక్షిణామూర్తి దక్షిణ దిశలో కూర్చుని ఉంటారు. దక్షిణ దిశలో యముడు ఉంటాడు. దీన్ని మృత్యు దిశ అంటారు. దక్షిణ దిశ నుంచి వచ్చే మృత్యు భయం నుంచి భక్తులను రక్షించబడే దేవుడిగా దక్షిణామూర్తి కొలవబడుతున్నాడు. తూర్పు దిక్కు నుంచి వచ్చే ఆపదల నుంచి యముడి చేతుల్లో ఉన్న మరణం నుంచి దక్షిణామూర్తి రక్షిస్తారని నమ్మకం. యముడి చూపు మనపై పడకుండా దక్షిణామూర్తి నిత్యం కాపాడతాడని చెబుతారు. యముడ్ని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం అని అర్థం. దయ వల్ల దుఃఖాలు తొలగిపోవడాన్ని దాక్షిణ్యం అంటారు. దుఃఖాలను పూర్తిగా నిర్మూలించే శక్తి దక్షిణామూర్తికి మాత్రమే ఉంది. దక్షిణామూర్తి అంటే జ్ఞాన గంగ. వశిష్ఠుడు కూడా దక్షిణామూర్తిని ప్రసన్నం చేసుకుని బ్రహ్మ విద్యను పొందాడు.
దక్షిణామూర్తి అంటే జ్ఞాన గురువు. సాక్షాత్తు పరమశివుని అవతారం. మర్రి చెట్టు కింద కూర్చుని జ్ఞానాన్ని బోధించే గురువుగా దర్శనమిచ్చారు. మృత్యు భయాన్నే కాకుండా.. అజ్ఞానాన్ని తొలగించే దేవుడిగా నమ్ముతారు. జీవితంలో వచ్చే దుఃఖాలన్నిటికీ కారణం అజ్ఞానం. అజ్ఞానం వల్లే మనుషులకు శాంతి ఉండదు. ఆర్థిక వైకల్యం, అప్పులు వంటి బాధలు వెంటాడుతుంటాయి. అయితే ఆ అజ్ఞానాన్ని తొలగించే దైవమె దక్షిణామూర్తిగా నమ్ముతారు. పరమ శివుని అవతారమైన దక్షిణామూర్తిని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సంపద కలుగుతుందని, మృత్యు భయాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ మహా శివరాత్రికి దక్షిణామూర్తి విగ్రహాన్ని గానీ, ఫోటోని గానీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఓం నమఃశ్శివాయ!