అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సుఖసంతోషాలు, సంపద రెట్టింపు అవుతాయని నమ్ముతారు. అయితే అందరూ బంగారం కొనలేరు కదా. దిగువ మధ్యతరగతి వారు, పేదవారు బంగారం కొనలేరు. మరి ఇలాంటి వారు ఏం చేస్తే ఫలితం వస్తుంది?
అక్షయ తృతీయ రోజున ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా పురాణాల్లో చెప్పబడిన ఘట్టాలు ప్రారంభమైన రోజు ఈరోజు. కృతయుగం మొదలైన రోజు ఈరోజే. విష్ణు మూర్తి దశావతారాల్లో ఒకటైన పరశురాముని అవతారం నేల మీదకొచ్చిం రోజు ఈరోజే. నిరుపేద కుచేలుడికి స్నేహితుడైన కృష్ణుడు సిరి సంపదలను ప్రసాదించిన రోజు ఈరోజే. వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించడం ప్రారంభించిన రోజు ఈరోజే. ఏడాదికొకసారి జరిగే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభమయ్యేది ఈరోజునే. పాండవులు వనవాసానికి బయలుదేరే ముందు వారికి ఎల్లప్పుడూ పుష్కలంగా ఆహారం ఉండేలా శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయపాత్ర ఇచ్చిన రోజు ఈరోజే. అక్షయ పాత్ర గురించి తెలిసే ఉంటుంది మీకు. అందులో ఆఖరున ఒక్క మెతుకు మిగిలినా పాత్ర మొత్తం నిండిపోతుంది.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే అందరూ బంగారం కొనలేరు. దిగువ మధ్యతరగతి వ్యక్తులు, నిరుపేదలు బంగారం కొనలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. అలాంటి వారు బంగారం కొనకపోయినా వారి జీవితంలో సుఖసంతోషాలు, సంపదలు సిద్ధిస్తాయి. దీని కోసం కొన్ని పనులు చేస్తే చాలని శాస్త్రాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనం తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహమాడిన రోజు ఈరోజే. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ సంపదలకు నిలయంగా భావిస్తారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కోసం అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉంటారు. ఈరోజున అన్నం, ఉప్పు, నెయ్యి, కూరగాయలు, పండ్లు, బట్టలు వంటివి అవసరం ఉన్నవారికి దానం చేస్తారు.
విష్ణుమూర్తి చిహ్నంగా తులసి నీటిని ఇంటిలో, ఇంటి బయటా చల్లితే మంచిది. ఇక ఈరోజున బంగారం కొనలేని వారు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏకాక్షి కొబ్బరికాయ అంటే ఒకే ఒక్క కన్ను ఉన్న కొబ్బరికాయ అని అర్థం. ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని శ్రీ ఫలం అని కూడా అంటారు, అంటే లక్ష్మీదేవి యొక్క ఫలము అని అర్థం. ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు శివలింగాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే మేలు జరుగుతుందని చెబుతున్నారు. పాదరస శివలింగాన్ని తెచ్చుకుని పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
బంగారం కొనలేనివారు ఇలా చేస్తే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే వచ్చే ఫలితం వస్తుందని చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో.. అలాంటి ఫలితాలు బంగారం కొనలేకపోయినా గానీ దానధర్మాలు, ప్రత్యేక పూజలు చేయడం వల్ల వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున వ్రతం చేసినా, పూజ చేసినా, హోమం నిర్వహించినా దాని ఫలితం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఏప్రిల్ 22 ఉదయం 6:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:25 గంటల మధ్యలో పూజ సమయంగా పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేస్తే అంతా శుభమే జరుగుతుందని అంటున్నారు. మరి బంగారం కొనలేకపోతున్నారని చింతించకండి. మంచి మనసుతో ఆ భగవంతుడ్ని, లక్ష్మీదేవిలను పూజించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్..