ఈ మద్య కొంతమంది కిలేడీలు వివాహం చేసుకున్న కొద్ది రోజులకే బంగారం, డబ్బుతో ఉడాయిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇలా నిత్య పెళ్లికూతుళ్ల గుట్టు పోలీసులు రట్టు చేస్తున్నారు.
ఈ మద్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా బురిడీ కొట్టిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ మద్య కొంతమంది పురుషులు, మహిళలు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వివాహం చేసుకొని అందినంత డబ్బుతో ఉడాయిస్తున్నారు. అలాంటి నిత్య పెళ్లి కూతురు, పెళ్లికొడుకు గుట్టు రట్టు కావడంతో పోలీసులు జైలుకు పంపుతున్నారు. తాజాగా ఓ నిత్య పెళ్లికూతురు గుట్టు రట్టయ్యింది. వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బు, బంగారంతో వరుడి ఇంటి నుంచి పారిపోవడం ఆ పెళ్లికూతురి నైజం. అలా ఏకంగా 12 కు పైగా పెళ్లిళ్లు చేసుకొని అందరినీ దారుణంగా మోసం చేసింది. ఓ వ్యక్తి ఆమె మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లికూతురు బాగోతం బయటపడింది. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. బుద్గం కు చెందిన మహమ్మద్ అల్తాఫ్ మీర్ తో షాహిన్ (30) అనే యువతితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా వచ్చిన డబ్బులు, బంగారం తీసుకొని షాహిన్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
తాము దారుణంగా మోసపోయామని గ్రహించిన మహమ్మద్ అక్తర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో షాహిన్.. రాజౌరి జిల్లాలోని నౌషేరాలో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జులై 14న ఆమెను అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే.. ఆమె అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని షాహిన్ అక్తర్ తమను కూడా పెళ్లి చేసుకొని మోసం చేసిందని 12మంది పురుషులు ఆరోపించారు. మరోవైపు షాహిన్ బెయిల్ కోసం బుద్గామ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత డబ్బు, నగలతో షాహిన్ ఉడాయించినట్లు వారంతా ఆరోపించారు. అయితే షాహిన్ ఎంతమందిని పెళ్లి చేసుకొని మోసగించిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.