కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వచ్చిన నవ వధువు మొదట్లో కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన వెంకట బార్గవికి రెండు నెలల కిందట పులివెందులకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలల పాటు భార్గవి భర్తతో సంతోషంగానే మెలిగింది. అయితే శ్రావణమాసం కావడంతో ఇటీవల భార్గవి అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది.
ఇక తల్లిదండ్రులతో పాటు ఎంతో అప్యాయంగా గడిపిన భార్గవి ఇటీవల షాపింగ్ కోసమని బయటకు వెళ్లొస్తానంటూ చెప్పి వెళ్లింది. సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఖంగారుపడి అల్లుడికి ఫోన్ చేసి భార్గవి సమాచారాన్ని తెలుసుకున్నారు. తన వద్దకు రాలేదని చెప్పడంతో భార్గవి తల్లిదండ్రులు బంధువులకు సమాచారం అందించారు. అయినా కూడా భార్గవి జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఏం చేయాలో తోచక ఆ వివాహిత తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన భార్గవి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అయితే ఈ క్రమంలోనే అదే గ్రామంలో కుళ్లిపోయిన స్థితిలో భార్గవి మృతదేహం కనిపించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. భార్గవి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. దీంతో పోలీసులు భార్గవి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే చివరగా అదే గ్రామానికి చెందిన బొందల గోపాల్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం.. గోపాల్, భార్గవి బైక్ పై ఎద్దుమడుగు ప్రాంతానికి వెళ్లినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా అనేక కోణాల్లో అనుమానమున్న పోలీసులు భార్గవి మరణంపై హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పరారీలో ఉన్న గోపాల్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.