కులాలు, మతాలు, భాషలు, జాతులు వేరైనా మనమంతా ఒక్కటే అని ఎవ్వరు చెప్పినా పరువు కోసం పాకులాడే మనస్తత్వాలు మనవి. కనిపించని పరువు కోసం బంధువులతో గొడవపడతాం. చివరకు కన్న వారిని, తోడబుట్టిన వారిని వదులుకుంటాం. ఇదే పరువుకు బలైపోయిందీ శుభాంగి అనే యువతి. ప్రేమించిన వ్యక్తి కోసం పెద్దలు కుదిర్చిన వివాహం కాదన్నందుకు కడుపున పుట్టిన బిడ్డను బలిగొన్నారు ఆమె తల్లిదండ్రులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. పింప్రి మహిపాల్లోని లింబ్‌గావ్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల శుభాంగి జోగ్డండ్ హోమియోపతి మెడిసన్ అండ్ సర్జరీ (బిహెచ్ఎంఎస్) మూడు సంవత్సరం చదువుతుంది. శుభాంగి అదే గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడిని ప్రేమించగా.. ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. మరొక వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. అయితే తాను ప్రేమించిన వ్యక్తి గురించి నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో చెప్పి పెళ్లిని ఆపివేసింది. తరుణ్‌ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది.
ఇది జీర్ణించుకోలేని ఆమె తండ్రి శుభాంగిని అంతమొందించాలని ప్రణాళికలు రూపొందించారు. దీని కోసం ఆమె సోదరుడు, మామ, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను గ్రామంలోని పొలానికి తీసుకెళ్లి గొంతు పిసికి చంపేశారు. అనంతరం దహన సంస్కారాలు ముగించేసి.. సాక్ష్యాలు దొరక్కుండా అస్థికలను సమీపంలోని కాలువలో పడేశారు. అయితే కొన్ని రోజుల నుండి శుభాంగి ఆచూకీ లభించకపోవడంతో స్నేహితులు, గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బృందాన్ని ఆ గ్రామానికి తరలించి విచారణ చేపట్టారు.
తొలుత తమకు ఏమీ తెలియదన్న శుభాంగి తండ్రి, పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టడంతో నేరం అంగీకరించారు. గత ఏడాది డిసెంబర్ 22న తమ కుమార్తెను హత్య చేసినట్లు తెలిపారు. పరువు తీసిందన్న కారణంగా ఆమెను చంపేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు శుభాంగి తండ్రితో పాటు ఈ హత్యకు సహకరించిన వారిపై ఐపిసిలోని 302, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ తెలిపారు. దేశం సాంకేతికంగా ముందుకు వెళుతున్నా.. ఇంకా దేశంలో పరువు హత్యలు చోటుచేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.