గత కొన్ని రోజుల నుంచి లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నమ్మి లోన్ తీసుకున్న అనేక మందికి అధిక వడ్డిని చెల్లించాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక ఇదే కాకుండా చెల్లించడం కాస్త ఆలస్యం అయిందటే చాలు.., వారి ఫొటోలను మార్పింగ్ చేసి స్నేహితులకు, బంధువులకు పంపుతున్నారు. తట్టుకోలేని అనేక మంది యువకులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే లోన్ యాప్ నిర్వాహకులు హద్దులు దాటి ప్రవర్తించడంతో ఓ అమాయకపు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రాంతానికి చెందిన శేఖర్ (32) అనే యువకుడికి గతంలో ఓ లోన్ యాప్ నిర్వాహకులు లోన్ కావాలా అంటూ ఫోన్ చేసి అతని అకౌంట్ లోకి రూ. 2 వేలు పంపించారు. ఇక వారం తర్వాత ఆ యువకుడు తీసుకున్న రుణం చెల్లించాడు. ఆ తర్వాత మరలా అతని అకౌంట్ లోకి బలవంతంగా రూ.2500 పంపించారు. మళ్లీ తిరిగి చెల్లించాడు. ఇక కొన్ని రోజులు గడిచాక ఆ లోన్ యాప్ నిర్వాహకులు అతడి ఫోన్ ను హ్యాక్ చేసి అతని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు.
ఆ తర్వాత అతని ఫొటోలు తీసుకుని మార్ఫింగ్ చేశారు. అలా మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలను అతని స్నేహితులకు, బంధువులకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన పరువు పోయిందని గ్రహించిన శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం శేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది.