ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కోట్లుకు కోట్లు.. ఖర్చు పెడుతోంది కానీ, ఆయా రాష్ట్రాల ప్రజలలో మాత్రం ఎలాంటి మార్పు కనపడట్లేదు. ఉదయాన్నే లేసింది మొదలు.. స్కామ్ లు, అత్యాచారాలు, వింత నిర్ణయాలు.. వంటి ఘటనలు ఏవో ఒకటి వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. ఇప్పటివరకు.. వరుడు గుట్కా నమిలాడని, మందు తాగాడని, విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసాడని.. పెళ్లి రద్దు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ, మొదటిసారి పెళ్ళికొడుకు.. ఖరీదైన కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి పీటల మీదనే వద్దనేశాడు. పోనీ, ఈ నిర్ణయం తెలివి తక్కువ వాడు తీసుకున్నాడేమో అనుకుంటే పొరపాటు. ఆయనొక.. ప్రభుత్వ లెక్చరర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్, విజయ్‌నగర్ పరిధిలోని సిద్ధార్థ్ విహార్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గతేడాది మేలో ఒక మహిళతో పెళ్లి సంబంధం కుదిరింది. అదే ఏడాది జూన్ 19న వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జనవరి 30న వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఆ సమయంలో వరుడు ఖరీదైన కారు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏ కారు కొనిచ్చినా నా కూతురు కోసమే అనుకున్న వధువు కుటుంబం వారి స్తోమతుకు తగ్గట్టుగా వ్యాగనార్‌ను బుక్ చేసింది.
దీనికి ససేమిరా అన్న వరుడి కుటుంబం తమకు ఫార్చ్యూనర్ కారే కావాలని డిమాండ్ చేసింది. అంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చేందుకు వధువు కుటుంబం నిరాకరించడంతో, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు వధువు ఫోన్‌కు వరుడు మెసేజ్ పంపాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుడు, అతడి కుటుంబంపై వరకట్నం చట్టం, ఇతరసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంత కట్నం ఆశ ఉన్న వరుడి ఇంటికి వధువుని ఇచ్చినా సంతోషంగా ఉంటుందా అంటే చెప్పలేం.. కొన్ని రోజులు గడిచాక తనలోని కట్న పిశాచి మరోసారి నిద్ర లేవచ్చు. ఈ కట్న పిశాచిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.