సంసార సాగరంలో అలకలు, పొరపొచ్చాలు సర్వసాధారణం. ఎన్ని విభేదాలున్నా కలిసి మెలిసి జీవించాలి. కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా మద్యానికి బానిసైన భర్తతో కాపురం అంటే అంత ఈజీ కాదు. అతను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా మద్యానికి బానిసైన భర్త ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఇల్లుని కూడా గుల్ల చేస్తాడు. అలా మారిన ఓ భర్తను మార్చేందుకు ఆ భార్య ఎంతో కష్టపడింది. అతను మందు మానేస్తే ఆనందంగా జీవించవచ్చని కలలు కనింది. కానీ, ఆమె ఆ ప్రయత్నమే ప్రాణాల మీదకు తెస్తుందని తెలుసుకోలేక పోయింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్పకు కర్ణాటకకు చెందిన లక్ష్మీదేవి(45)తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరికి పెళ్లైంది వారు బెంగళూరులోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నరసింహప్ప చిన్నకారు రైతు, ఇంట్లో పాడు కూడా ఉంది. అయితే కొద్ది రోజులుగా నరసింహప్ప మద్యానికి అలవాటు పడ్డాడు. ఇంట్లో ఏ విషయాన్ని పట్టించుకోకుండా తాగుతునే ఉంటున్నాడు.
వ్యవసాయం, పాడి, కుటుంబ పోషణ మొత్తం లక్ష్మీదేవి చూసుకోవడం మొదలు పెట్టింది. తాగుడు కోసం డబ్బు ఇవ్వాలని లక్ష్మిని ఇబ్బంది పెట్టేవాడు. ఆమె కూడా వచ్చిన సొమ్ములో కాస్త భర్తకు ఇస్తూ వచ్చింది. ఇంక నరసింహప్ప పూర్తిగా మద్యానికి బానిసగా మారిపోయాడు. రోజులో ఒకసారైనా మందు తాగాల్సిందే. అలా తాగకపోతే పిచ్చి వాడిలా ప్రవర్తించే వాడు. అలా అయితే కష్టమని భావించిన లక్ష్మి భర్తను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. భర్తకు డబ్బు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. ఆ విషయంలో ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. భర్తను బాగు చేసుకోవడం కోసం గొడవలు అయినా పర్లేదని అనుకుంది.
ఇదీ చదవండి: బిడ్డ పుట్టిన ఆనందంలో పార్టీ ఇస్తే.. ఫుల్లుగా తాగి పొడిచి చంపారు..
శనివారం మధ్యాహ్నం మద్యానికి డబ్బు కావాలని భార్య కాళ్లావేళ్లా పడ్డాడు. ఎలాగైనా డబ్బు ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. రాత్రి కూడా మళ్లీ డబ్బు కోసం గొడవకు దిగాడు. లక్ష్మి డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆ విషయం మనసులో పెట్టుకున్న నరసింహప్ప ఆమెను హత మార్చాలని నిర్ణయించుకున్నాడు. నిద్రపోతున్న భార్య మెడపై గొడ్డలితో ఒక వేటు వేశాడు. తీవ్ర రక్తస్రావంతో లక్ష్మీదేవి అక్కడికక్కడే మరణించింది. నరసింహప్ప తమ్ముడి కొడుకు తెల్లవారుజామున పాలకోసం వచ్చిన సమయంలో ఈ హత్య విషయం వెలుగు చూసింది.
పిన్ని ఎక్కడకు వెళ్లింది అంటూ నరసింహప్పను ఈరన్న ప్రశ్నించాడు. ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో ఇంట్లో చూసిన ఈరన్నకు రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న లక్ష్మీదేవి కనిపించింది. వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నరసింహప్పను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.