Crime News: దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారిని చిన్న చూపు చూడటంతో పాటు.. వారితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా, తోటి యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌పై దాడులకు పాల్పడ్డారు కొందరు యువకులు. ఓ ట్రాన్స్‌జెండర్ జుట్టు కత్తిరించి అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాదు! దీన్నంతా వీడియో తీశారు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తిరుణల్వేలి జిల్లాకు చెందిన కొందరు యువకులు కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను బంధించారు.
తోటి యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని, బలవంతంగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. మూతిపై పిడిగుద్దులు గుద్దారు. వారు నొప్పి భరించలేక గట్టిగా ఏడుస్తూ.. వదిలిపెట్టమని బతిమాలినా వదల్లేదు. ఓ ట్రాన్స్‌జెండర్ జుట్టును సైతం కత్తిరించారు. దీన్నంతా వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్న గ్రేస్ బాను స్పందించారు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో బుధవారం షేర్ చేశారు. ‘‘ ఓ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లపై కొందరు రౌడీలు దాడి చేశారు. పోలీసులు నిశ్శబ్ధాన్ని వీడాలి’’ అని రాసుకొచ్చారు.
మరో ట్విటర్ పోస్ట్‌లో ‘‘ ఇలాంటి హింసాత్మక ఘటనలకు ముగింపెప్పుడు. ట్రాన్స్‌జెండర్లపై ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్న సమయంలో మీరిలా నిశ్శబ్ధాన్ని పాటించటం బాగోలేదు. నా జాతి వారు ఇలాంటి దారుణాలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు’’ అని పేర్కొన్నారు. గ్రేస్ బానుతో పాటు చాలా మంది ఈ దాడిని ఖండించారు. యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
When this kind of violence going to end .When Cis people face this same kind of violence I am surely says you people not keeping this kind of silence .my community persons facing this kind of violence everyday pic.twitter.com/T5wmqgLZDl
— GRACE BANU (@thirunangai) October 12, 2022