డబ్బే ఊపిరిగా బ్రతుకుతున్న రోజులివి. పది రూపాయలు మిగులుతాయంటే.. అయినవారినే కాటికి పంపుతున్న సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో ఒక్క లైక్ కొడితే 50 రూపాయలు వస్తాయంటే ఎవరైనా ఊరుకుంటారా! ఊరుకోవడం కాదు కదా.. గంటకు 50 లైకులు.. రోజుకు 300 లైకులు అయినా కొట్టాలంటూ చేతివేళ్లతోనే లెక్కలు వేస్తారు. ఈ అత్యాశనే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకొని తియ్యని మాటలతో బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా, ఇలానే ఒక ఉద్యోగికి లైక్ కొడితే ఒక్కో వీడియోకు రూ.50 సంపాదించవచ్చని ఆశ చూపిన సైబర్ నేర గాళ్లు అతని వద్ద లక్షల్లో కాజేశారు.
సైబర్ మోసాల పట్ల అధికారులు, పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా మోసపోతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. పోనీ, చదువుకోని వారు మోసపోతున్నారంటే ఒక అర్థం ఉంది.. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా వీరి బారిన పడుతున్నారు. అత్యాశనే పెట్టుబడిగా పెట్టి.. సర్వం కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వ్యక్తి.. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెల వారీ జీతంతో ఎలాంటి చింతా లేకుండా అనందంగా జీవిస్తున్నాడు. అయితే, కొద్ది రోజుల క్రితం అతని ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. వీడియో క్లిప్‌ల లింక్‌లను క్లిక్ చేసి.. లైక్ కొడితే ఒక్కో వీడియోకు 50 రూపాయలు పొందవచ్చన్నది దాని సారాంశం. అంతేకాదు.. బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా ఖాతాలోకే డబ్బు జమ అవుతాయని అందులో రాసుంది.
ఈ మెసేజ్ చూశాక అతనిలో డబ్బుపై ఆశ కలిగింది. వెంటనే అందులో చెప్పినట్లే చేశాడు. లింక్‌పై క్లిక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేశాడు. వెంటనే టింగ్.. టింగ్.. మని అతని ఫోన్ కు మూడు వీడియోలు వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి లైక్ కొట్టగానే అతని ఖాతాలో రూ.150 జమ అయ్యాయి. అనంతరం మరో 14 వీడియోలను లైక్ చేసి, మరింత డబ్బు పొందాడు. అలా రూ.1,000 పెట్టుబడి పెడితే రూ.9,000 వచ్చింది. దీంతో అతనికి డబ్బు పట్ల మరింత ఆశ పెరిగింది. ఇలా వందలు.. వేలు కాదనుకున్నాడు. ఒకేసారి ఎక్కువ డబ్బును పెట్టుబడిగా పెడితే.. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని భావించి, తనకున్న మరో రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 12.24 లక్షలు బదిలీ చేశాడు.
వీడియోలు చూడటం.. లైక్ కొట్టడం.. కంటిన్యూ చేశాడు. అయితే, మునుపటిలా డబ్బులు మాత్రం జమ కావట్లేదు. పోనీ, ఇంకొన్ని వీడియోలు చూడాలేమో అని కంటిన్యూ చేసినా ఎంతకీ డబ్బు జమ కాకపోవడంతో వారికి కాల్ చేశాడు. వారి ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్ళను పట్టుకొనే పనిలో పడ్డారు. మీకు కానీ, మీ ఇంట్లో వారికి కానీ ఇలాంటి మెసేజులు వస్తే.. క్లిక్ చేయకండి. ఉన్నది పోగొట్టుకోకండి. బాధితుడి అత్యాశపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.