ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని.. ఆనందంగా తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. అయితే విధి రాత మరోలా ఉంది. దేవాలయం వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. అదును చూసి పంజా విసిరింది. ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కబళించింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఇక ఈ ఘటనలో మరో 10 మది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణం కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటక రాష్ట్రం ఒకే కుటుంబానికి చెందిన 14 మంది టెంపో ట్రావెలర్‌లో దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలి ఆలయానికి వెళ్లి, హసనాంబ, కుకే సుబ్రమణ్య క్షేత్రాలను దర్శించుకుని తిరిగి వస్తుండగా.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులంతా ధర్మస్థలిలో శ్రీమంజునాథ స్వామిని దర్శించుకుని టెంపో ట్రావెలర్లో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. హాసన్ జిల్లా అర్సికేరె మండలం గాంధీనగర్ వద్ద శనివారం రాత్రి మూడు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. పాల ట్యాంకర్, కర్ణాటక ఆర్టీసీ బస్సు మధ్యలో.. భక్తులు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ చిక్కుకుని నుజ్జునుజ్జు అయింది.
ఇక ప్రమాదం సమయంలో టెంపోలు ఉన్నవారందరూ నిద్రపోతుండటంతో.. ఏం జరిగిందో అర్థం కాలేదు. వారు తేరుకునే లోపే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారు. విషాదకరం అంశం ఏంటంటే మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి హసన్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇక పాలట్యాంకర్ రాంగ్ రూట్‌లో వచ్చి, బెంగళూరు-శివమొగ్గ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు వెల్లడించారు ప్రమాదం తర్వాత పాల ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని.. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. . ఈ ప్రమాదంలో లీలావతి (50), చిత్ర (330, సమర్త్ (10), డింపీ (12), తన్మయి (10), ధ్రువ్ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) అనే వ్యక్తులు మృత్యువాత పడ్డారు.