ప్రేమ అనే అనుభూతిని వర్ణంచడానికి మాటలు చాలవు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు అన్ని ఇన్ని కావు. ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో నిలిచిపోయారు. ఓ మనిషిని పిచ్చి వాడిని చేయాలన్నా.. మహారాజును చేయాలన్న ఆ శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒకప్పుడు ప్రేమను దైవంతో సమానంగా భావించేవారు. ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకునేవారు. అయితే నేటి కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించిన యువతి కాదంటే.. కర్కశకంగా కడతేర్చడం.. పరువు హత్యలు నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం కర్ణాటక విజయపుర జిల్లాలోని కృష్ణా నది వెనక జలాల్లో.. గోనె సంచిలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. ఇక పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహం ఆధారంగా.. ఓ ప్రేమ జంట మృత్యు రహస్యం బట్టబయలైంది. ఈ ఘటనలో సదరు యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆ యువకుడిని అమ్మాయి కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేసినటుల భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన మల్లిఖార్జున జమఖండి, కల్లవగికి చెందిన గాయత్రిలు కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. విజయపురలోని కళాశాలకు బస్సులో వెళ్లి వచ్చే క్రమంలో వీరికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 23న మల్లిఖార్జున గాయత్రి ఇంటికి వెళ్లాడు. పొలం పక్కనే ఈ ఇల్లు ఉంది. ఓ గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్న వీరిని గాయత్రి తండ్రి చూశాడు. వెంటనే వెళ్లి ఆ గదికి తాళం వేశాడు. ఆ భయంతో గాయత్రి గదిలో ఉన్న పురుగులు మందు తాగింది. ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో వెంటనే మృతి చెందింది. కొద్ది సేపటి తర్వాత యువతి తండ్రి.. మరికొందరు బంధువులు వచ్చి గది తాళం తీయగా.. వారికి గాయత్రి మరణించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన గాయత్రి తండ్రి, బంధువులు.. యువకుడి నోటిలో బలవంతంగా పురుగుల మందు పోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ తర్వాత గాయత్రి, మల్లిఖార్జున మృతదేహాలను సెప్టెంబర్ 24న వేర్వురు గోనసంచుల్లో కట్టి… కొర్తికొల్లార వంతెన వద్ద.. కృష్ణా నదిలోపడేశారు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు.. అక్టోబర్ 5న తమ కుమార్తె గాయత్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి తల్లిదండ్రులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 10న బీళగి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. శవం ఒంటి మీద ఉన్న టీషర్ట్ ఆధారంగా యువకుడి ఆధారాలు గుర్తించారు. ఇక దర్యాప్తులో ప్రేమికుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మరోకరు హత్యకు గురైనట్లు తేలింది. ఇక ఇది పరువు హత్యే అనే అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి అన్నారు పోలీసులు.