నవీన్ హత్య కేసులో ఏ3గా ఉన్న నిహారిక రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె జైలు నుంచి విడుదల కానుంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా హరిహరకృష్ణ ఉండగా, మరో నిందితురాలిగా అతని ప్రియురాలు నిహారిక ఉంది. తాజాగా నిహారికకు బెయిల్ వచ్చింది. నిహారికా రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదల కానుంది. నవీన్ హత్య కేసులో ఏ1 గా హరిహరకృష్ణ, ఏ2గా హరి స్నేహితుడు హాసన్, ఏ3గా నిహారిక ఉన్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు నిహారికకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవీన్ ను హత్య చేసినట్లు హాసన్, నిహారికకు హరి ముందే చెప్పాడని.. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా ఫోన్ లో సమాచారాన్ని తొలగించారు. దీంతో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేశారు.
నవీన్ హత్య కేసులో హాసన్, నిహారికల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ప్రశ్నించగా.. హత్య గురించి తమకు తెలిసిన వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన కొన్ని రోజుల వరకూ పోలీసుల విచారణలో నిహారిక ఏమీ మాట్లాడలేదు. తనను విచారిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు నిహారికను సఖి కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత పోలీసులు నిహారికను అదుపులోకి తీసుకుని విచారించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత ప్రియుడు హరికి నిహారిక ఆన్ లైన్ లో రూ. 1500 పంపినట్లు తేలింది. ఇక నిహారిక కోసమే తాను నవీన్ ను చంపానని హరి పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిహారికకు కాల్స్ చేస్తున్నాడని, ఆమెను వేధిస్తున్నాడని.. అందుకే కోపంతో నవీన్ ను చంపినట్లు నిహారిక ప్రియుడు హరి వెల్లడించాడు. కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏ3గా ఉన్న నిహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.