తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలం, కొత్తపల్లి శివారులో రైల్వే కార్మికులని రైలు ఢీ కొట్టింది. రైలు పట్టాలు మరమ్మత్తులు చేస్తున్న ముగ్గురు రైల్వే కార్మికుల మీదకి ఎక్స్ ప్రెస్ రైలు దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి బెంగుళూరు వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు.. రైలు పట్టాలు మరమ్మత్తులు చేస్తుండగా రైల్వే కార్మికుల మీద నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ గ్రీజింగ్ చేస్తున్న సమయంలో పక్క ట్రాక్ మీద నుంచి గూడ్స్ రైలు వెళ్తున్న కారణంగా ఆ శబ్దానికి రైల్వే కార్మికులు ఉన్న ట్రాక్ మీద రాజధాని ఎక్స్ ప్రెస్ రావడాన్ని గమనించలేకపోయారు.
దీంతో వేగంగా వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు వారిని బలంగా ఢీ కొనగా కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని రైల్వే సిబ్బంది దుర్గయ్య, రోజు వారీ కూలీలు శ్రీనివాస్, వేణులుగా గుర్తించారు స్థానికులు. సమాచార లోపం కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.