విశాఖపట్నంలో డ్రమ్ములో మహిళ అస్థిపంజరం వెలుగు చూడటం ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంఘటన జరిగి సుమారు ఏడాది అవుతుందని పోలీసులు వెల్లడించారు. ఇక గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దీని గురించే చర్చ. ఇక పోలీసులు పట్టు విడవకుండా ప్రయత్నం చేయడంతో.. నిందితుడు దొరికాడు. ఒక్క చిన్న పేపర్ క్లూతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఆ వివరాలు.. డ్రమ్ములో కనిపించిన మృతురాలు.. శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఇక ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు.. రిషివర్ధన్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఇక ఇంతటి దారుణానికి ప్రధాన కారణం.. వివాహేతర సంబంధం, డబ్బుల విషయంలో వివాదం తలెత్తడం అని వెల్లడించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
నండూరి రమేష్ అనే వ్యక్తి ఎండాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2020లో అతడి వద్దకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రిషి.. పని నేర్చుకునేందుకు రమేష్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో రమేష్.. తనకు మధురవాడ వికలాంగుల కాలనీలో ఉన్న ఇంటిని.. రిషిని అద్దెకు ఇచ్చాడు. 2020, సెప్టెంబర్‌లో రిషి.. తన భార్యతో కలిసి.. ఇంట్లో అద్దెకు దిగాడు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి అద్దె చెల్లించడం మానేశాడు. ఆ తర్వాత 2021 మే నుంచి కరెంటు బిల్లు కూడా చెల్లించలేదు రిషి. ఈ క్రమంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుండటంతో.. ఓ రోజు రమేష్.. మధురవాడలో రిషికి అద్దెకు ఇచ్చిన ఇంటిని చూడటం కోసం ఈ ఏడాది డిసెంబర్ 4న అక్కడికి వెళ్లాడు.
ఇంటికి తాళం వేసి ఉంది. కానీ ఫ్యాన్ తిరగడం, లైట్లు వెలుగుతూ కనిపించడంతో రమేష్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటి వెనక వైపుగా వెళ్లి.. చూడగా.. అక్కడ తలుపు తీసి ఉంది. అక్కడ ఓ పక్కన ప్లాస్టిక్ డ్రమ్ము టేప్‌తో సీల్ వేసి ఉండటం గమనించాడు రమేష్. అలాగే దుర్వాసన రావడంతో.. వెంటనే పీఎం పాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలిసి వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు.. డ్రమ్ము తెరిచి చూడగా.. దానిలో వారికి మహిళ పుర్రె, అస్థిపంజరం, జుట్టు కనిపించడంతో షాకయ్యారు. వెంటనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులుకు ఆ ఇంట్లో ఓ బ్యాగ్ దొరికింది. దానిలో ఓ చిన్న పేపర్ మీద ఓ ఫోన్ నంబర్ రాసి ఉంది. దాని గురించి విచారించగా.. అది రిషి నంబర్ అని తెలిసింది. ఇక మొబైల్ నంబర్ ఆధారంగా కాల్ లిస్ట్ తీస్తే.. మృతురాలి వివరాలతో పాటు.. నిందితుడి రిషిని గుర్తించారు. ఇక అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు విచారణలో రిషి ఏం జరిగిందో వెల్లడించాడు. మృతురాలు బమ్మిడి ధనలక్ష్మితో రిషికి తొలిసారి 2021, మేలో పరిచయం ఏర్పడింది. అప్పటికే రిషికి వివాహం అయ్యి భార్య ఉంది. ఆమె గర్భవతి కావడంతో.. 2021 జనవరిలో శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పుకు పంపిచాడు. ఇక భార్యను చూసేందుకు అత్తారింటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న అత్తారింటికి వెళ్లేందుకు.. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాడు రిషి. ఈ క్రమంలో అతడికి బమ్మిడి ధనలక్ష్మితో పరిచయం ఏర్పడింది.
కాసేపటి పరిచయంలోనే వారిద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ధనలక్ష్మి.. తాను విశాఖ వస్తున్నాని చెప్పింది. దాంతో రిషి.. తన భార్య ఇంట్లో లేదని.. చెప్పడంతో.. ఆమె ఆ రోజు రాత్రి.. రిషి ఇంటికి వెళ్లింది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి.. తనకు రూ.2 వేలు కావాలని రిషిని అడిగింది. అప్పుడు రిషి.. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పాడు. ఈ క్రమంలో ధనలక్ష్మి.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని కోరింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ధనలక్ష్మి.. తాను అడిగినవి ఇవ్వకపోతే గొడవ చేస్తానని బెదిరించింది. ఆమె మాటలకు.. భయపడి రిషి.. ఆ కోపంలో.. ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బ్లాంకెట్ ప్లాస్టిక్ జిప్ కవర్‌లో ప్యాక్ చేశాడు.
ఆ తర్వాత ధనలక్ష్మి మృతదేహాన్ని.. ఇంట్లోని ప్లాస్టిక్ డ్రమ్‌లో దించి మూత పెట్టాడు. దానికి టేప్‌తో మూసివేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయి తన మొబైల్‌ను 13 రోజుల పాటూ స్విచ్ఛాఫ్ చేశాడు. ఆ తర్వాత తన అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇక తాను ఎవరికి దొరకనని భావించి ధైర్యంగా తిరిగడం ప్రారంభించాడు. ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు.. ఆ ఇంటిలో మృతురాలు ధనలక్ష్మి బ్యాగ్ దొరకడం.. అందులో రిషి ఫోన్ నంబర్ ఉండటంతో.. ఈ మిస్టరీ వీడింది. ఇక మృతురాలు ధనలక్ష్మికి అయినవాళ్లు, బంధువులు ఎవరూ లేకపోవడంతో.. ఆమె కనిపించడం లేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. దాంతో ఈ కేసు వెలుగులోకి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. ఆ తర్వాత రిషి చెన్నై వెళ్లాడు.. అక్కడి నుంచి వచ్చి 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్‌లో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.