ఇంటి పెద్ద సరిగా వ్యవహరించకపోతే, తల్లి పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉంటే.. పిల్లలకు తెలుస్తుంది. అయితే తండ్రిని నిలదీయ లేక, తల్లికి సర్థిచెప్పలేక సతమతమౌవుతుంటారు. చివరకు వారే తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆర్థిక సమస్యలకు తోడు మనస్పర్థలు ఇంట్లో కల్లోలాలను సృష్టిస్తున్నాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన తండ్రి మత్తుకు బానిస కావడమో, జులాయో లేదంటే ఇతర వ్యసనాల కారణంగా కుటుంబాన్ని పట్టించుకోకపోతే, నిలదీసిన భార్యపై దాడి చేస్తుంటే.. ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు పిల్లలు. అదే ఓ వయస్సు వచ్చిన పిల్లల ముందు కొట్టుకుంటే.. వారిపై తీవ్రంగా ప్రభావితమౌతుంది. తండ్రిని ఎదిరించలేక.. తల్లికి సర్థి చెప్పలేక సతమతమౌతుంటారు. మగ పిల్లలైతే .. దారి తప్పి, రౌడీలు, గుండాలుగా తయారైన దాఖలాలు ఉన్నాయి. ఇక ఆడపిల్లలైతే ఆ సమస్యను బయటకు చెప్పుకోలేక.. నరకయాతన పడుతుంటారు. తండ్రికి వేదన చెప్పుకోలేని స్థితిలో ఉంటే తల్లికి దగ్గరౌతుంటారు. ఇటువంటి ఘటనలే ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా పురిగొల్పుతున్నాయి.
ఏం కష్టమోచ్చిందో తెలియదు కానీ తల్లీ కూతుళ్లు ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్సై సందీప్‌కుమార్ వివరాల ప్రకారం మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో నివసించే డి.వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ(37) భార్యాభర్తలు. ఈశ్వరమ్మ గృహిణి. వీరికి పూర్వజ(19), హరిణి(18) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రస్తుతం వీరు చదువుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటేశ్వర్లు కారణంగా వారు ఇళ్లు విడిచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.