ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరుసగా గుండెపోటు మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పటి వరకు పెళ్లి సంబరాలతో కల కలలాడిన ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. పెళ్లింట సంతోషంగా గడిపిన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. కూతురు పెళ్లయిన కొన్ని గంటలకే ఆమె తండ్రి లింబాద్రి వయసు 45 గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు. ఈ విషాద ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.
జగిత్యాల జిల్లా కొత్తదాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన బెజ్జారపు లింబాద్రి, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వైష్ణవి వివాహం 2015లో జరిపించారు. చిన్న కూతురు సాయి ప్రియ నిజామాబాద్ జిల్లా బషీర్ బాద్ కి చెందిన చరణ్ తేజ్ తో గురువారం అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వివాహ వేడుకకు బంధువులు, మిత్రులు వచ్చి సందడి చేశారు. సాయంత్రం అప్పగింతలు పూర్తయ్యాయి.. కూతురు అత్తారింటికి వెళ్తుంటే లింబ్రాద్రి కన్నీటి పర్యంతం అయ్యారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి లింబాద్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారు జామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు లింబాద్రిని లేపగా విగతజీవిగా కనిపించాడు. రాత్రి నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు బంధువుల అంటున్నారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింబాద్రి.. అర్థరాత్రి సమయంలో గుండెపోటుకు గురై చనిపోవడంతో భార్య పద్మ, పెద్ద కూతురు వైష్ణవి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి వరకు పెళ్లి పందిట్లో అందరితో ఆనందంగా.. సంతోషంగ గడిపిన లింబాద్రి హఠాత్తుగా కన్నుముయడంతో కొత్తదాంరాజుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మద్యనే తెలంగాణలో వరుసగా గుండెపోటుతో కన్నుమూయడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. గుండెపోటు పేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు. అయితే గుండెపోటు గురైన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే బతికే ఛాన్సులు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.