హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇష్టం లేని స్కూలుకు వెళ్లమంటున్నారని పదో తరగతి బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు. ఉపాధి నిమిత్తం 17 ఏళ్ల కిందట హైదరబాద్ కు వచ్చి నగరంలోని కాప్రా కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని శ్రీహన్స్ వజ్రం అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి పదో తరగతి చదివే ఓ కుమార్తె కూడా ఉంది.
అయితే తండ్రి రవి స్థానికంగా వాచ్‌మన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా వీరి కూతురు ప్రస్తుతం సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే ఆ బాలిక గతంలో సాకేత్‌లోని విద్యాభారతి స్కూల్‌లో 9వ తరగతి వరకు చదివింది. అయితే రాను పోను రవాణాకు ఇబ్బంది అవుతుందని భావించిన ఆ బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఉండే సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్‌లో చేర్పించారు. కానీ ఈ స్కూలు ఆ బాలికకు నచ్చేలేదు. దీంతో నేను ఆ స్కూలుకు వెళ్లనని గత కొన్ని రోజుల నుంచి స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది.
దీనిని సహించలేకపోయిన తండ్రి రవి కూతురిపై కోపంతో ఊగిపోయి మందలించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. ఈ క్రమంలోనే వారుంటున్న అపార్ట్ మెంటు ఎదురుగా మరో భననం నుంచి వారి కుమార్తె దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.