టెక్నాలజీ, అక్షరాస్యత పెరుగుతున్న కొద్ది మోసాలు తగ్గిపోవాలి.. కానీ విచిత్రంగా సాంకేతికత పెరుగుతున్న కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అయితే నేటి కాలంలో జరుగుతున్న మోసాలను చూస్తే.. జాలి పడాలి అనిపించదు. ఎందుకంటే నేటి కాలంలో అత్యాశ వల్ల మోసాలకు గురవుతున్న వారే అధికంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రైస్ పుల్లింగ్, దొంగ బాబాలు వంటి వారి బారిన పడి మోసపోతున్న వారు నేటి కాలంలో అధికంగా ఉంటున్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. మోసం చేసే వారు ఎప్పుడు ఉండనే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జలకన్యలు అసలు ఉన్నారో లేరో తెలియదు. అలాంటిది జలకన్య కన్ను.. ఇది ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు అంటూ కొందరు మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఏకంగా కోట్ల రూపాయలు దోచే ప్లాన్ చేశారు. కానీ ఆఖరుకు పోలీసులకు చిక్కారు.
ఈ ఘరానా మోసం హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. జలకన్య కన్ను.. లక్కీ స్టోన్ అంటూ దందా ప్రారంభించారు ఇద్దరూ కేటుగాళ్లు. వరంగల్ జిల్లాలోని కాజీపేటకు చెందిన బల్స్గురి చందు(30) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మల్కాజిగిరిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి అల్వాల్‌కి చెందిన తాపీ మేస్త్రీ మడికొండ సాంబశివరావు (27) తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికి ఆర్థిక అవసరాలు భారీగా ఉన్నాయి. డబ్బు కావాలి. కానీ తాము చేసే చిరు ఉద్యోగాలతో డబ్బు సంపాదించడం చాల కష్టం అని అర్థం అయ్యింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఓ ఘరానా మోసానికి తెర తీశారు.
ఈ ఇద్దరు కలిసి జలకన్య కన్ను.. జలకాంత.. దీన్ని లక్కీ స్టోన్ అంటారు.. దీనికి అద్భుత శక్తులు ఉన్నాయి. ఇది మీ ఇంట్లో ఉంటే మంచిది మార్కెట్లో దీని విలువ రెండు కోట్ల రూపాయలు అని.. తాము మాత్రం తక్కువ ధరకే ఇస్తామంటూ కాప్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ లక్కీ స్టోన్ సమాచారం కాస్తా పోలీసులకు తెలియటంతో మల్కాజిగిరి ఎస్వోటి టీం రంగంలోకి దిగింది. జనాలు బురిడీ కొట్టిస్తోన్న ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక జలకాంత కన్ను అని చెప్పబడుతున్న వస్తువు, 3 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇలాంటి మోసగాళ్లది తప్పా.. వీరి బారిన పడుతున్న జనాలది తప్పా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.