ఆమెకు జీవితంపై ఎన్నో ఆశలు, భర్త, పిల్లలతో సంతోషంగా గడపాలని మరెన్నో కోరికలు. అలా తాను ఆశపడ్డ జీవితం ఇంతటితోనే ముగుస్తుందని ఆ మహిళ అస్సలు అనుకోలేదు. తాజాగా భర్త వేధింపులను భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది నల్గొండ జిల్లా దేవరకొండ. ఇదే ప్రాంతానికి శ్రీకాంత్ అనే వ్యక్తికి చిట్టిపోలే నాగలక్ష్మి(30) అనే యువతితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది.
తల్లిదండ్రులకు నాగలక్ష్మి ఒక్కతే కూతురు కావడంతో పెళ్లి సమయంలో 30 తులాల బంగారంతో పాటు కట్నం కింద నగదు కూడా ఇచ్చారు. కొంత కాలం నుంచి ఈ దంపతులు హైదరాబాద్ సరూర్ నగర్ లోని శ్రీవెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైన కొంత కాలం వీరి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగానే వర్ధిల్లింది. ఇక కొన్ని రోజుల తర్వాత వీరికి ఓ కుమార్తె జన్మించింది. పుట్టిన కూతురితో ఆ దంపతులు సంతోషంగానే గడిపారు. కానీ భర్త శ్రీకాంత్ కు డబ్బు మీద వ్యామోహం ఉండడంతో కొన్ని రోజులు గడిచాక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.
దీంతో అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధింపులకు గురి చేశాడు. విషయం ఏంటంటే? నల్గొండలో తన అత్తమామల పేరు మీద కోటి రూపాయలు విలువ చేసే రెండంతస్తుల భవనం ఉంది. దానిని తన పేరు మీద రాయాలని పట్టుబట్టాడు. ఇదే విషయంపై భార్యను రోజూ వేధించేవాడు. ఇక భర్త వేధింపులు ఎక్కువవడంతో భార్య నాగలక్ష్మి తట్టుకోలేకపోయింది. భర్త పెట్టే టార్చర్ ను భరించలేక తనలో తాను కుమిలిపోయింది. ఏం చేయాలో అర్థంకాదు, ఎవరికి చెప్పాలో తెలియదు. చివరికి బలవన్మరణానికి పాల్పడాలనే ఆలోచనకు వచ్చింది.
ఇందులో భాగంగానే శనివారం భర్త బయటకు, కూతురు స్కూలుకు వెళ్లడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నాగలక్ష్మి సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఉన్న ఒక్క కూతురు కూడా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.