జవహర్నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, అటుపైపు గాలించగా నీటిపై చిన్నారి శవం తేలుతూ కనిపించింది. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు. అయితే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. చెరువులో పడి నీరు మింగడం వల్ల బాలిక చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే బాలిక బంధువులు చెబుతున్న తీరు మరోలా ఉంది. బాలిక శరీరంపై కత్తి గాయాలు ఉన్నాయని.. బాలిక మిస్సైన సమయంలో చెరువు వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ కనిపించారని చెప్తున్నారు. దానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులను డైవర్ట్ చేసి మరో మార్గంలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో బాలిక బంధువులు పోలీసు వాహనంపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు.
గురువారం ఉదయం 9 గంటల 20 నిమిషాల సమయంలో బాలికను తండ్రి స్కూల్ వద్ద డ్రాప్ చేశాడు. అనంతరం చిన్నారి పార్కుకు వెళ్దామని స్నేహితులతో చెప్పగా వారు నిరాకరించారు. దీంతో చిన్నారి క్లాస్ రూంలో బ్యాగు పెట్టి ఒంటరిగానే స్కూల్ నుంచి బయటకు వచ్చింది. ఉదయం 10.20 గంటల ప్రాంతంలో క్లాస్ టీచర్ అటెండెన్స్ తీసుకోగా.. బాలిక మిస్సైనట్లు గుర్తించారు. బ్యాగు క్లాస్ రూంలోనే ఉండటంతో.. టీచర్లు స్కూల్ పరిసరాల్లో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న జవహర్ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. స్కూల్ నుంచి బాలిక వెళ్లిన రూట్ లో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా.. బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలిక చదువుతున్న పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు కిలోమీటర్ దూరంలో ఉంది. చిన్నారి అంతదూరం ఎందుకు వెళ్లిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.