హైవేలు, ఓఆర్ఆర్లతో పాటు సిటీల్లోనూ రోడ్ల ప్రమాదాలు పెరిగిపోయాయి. రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి వీటికి కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు పాదచారుల తప్పులు కూడా యాక్సిడెంట్లకు కారణం అవుతుండటం గమనార్హం.
రోడ్డు ప్రమాదాలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. సిటీ, హైవే అనే తేడాల్లేకుండా తరచూ ఎక్కడో చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. బండిని వేగంగా తోలే అవకాశం ఉన్న జాతీయ రహదారులు, రింగ్ రోడ్ల మీదే కాకుండా సిటీల్లోనూ ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం వల్ల ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు పాదచారుల తప్పులు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది. రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్లోని నాగోల్లో జరిగింది.
నాగోల్ యాక్సిడెంట్ ఘటనలో నడుస్తూ వెళ్తున్న పాదచారుడిదే తప్పని అంటున్నారు. అతడు రోడ్డు మీద మొబైల్ ఫోన్ చూసుకుంటూ.. రాంగ్ రూట్లో వస్తున్నాడు. దీంతో అతడికి ఎదురుగా ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. కారు దగ్గరిదాకా వచ్చినప్పుడు అతడు కూడా చూశాడు. సరిగ్గా అదే సమయంలో కారు అతడ్ని ఢీకొట్టడంతో.. గాల్లోకి ఎగిరి 15 అడుగుల దూరంలో పడ్డాడు. అతడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ఘటనలో కారు కూడా వేగంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని జైకుమార్గా గుర్తించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.