హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పెండింగ్ చలాన్లు చెల్లించలేక ఓ హమాలీ ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..!
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి పోలీసులు చలాన్లు వేయడం కామనే. చలాన్లు చెల్లించనివారిని మందలించడం లేదా వారి బైక్‌లను స్వాధీనం చేసుకున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఓ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు ఒక వ్యక్తి సూసైడ్‌కు కారణమైంది. ఉపాధి కోసం నల్గొండ జిల్లాకు చెందిన ఎల్లయ్య భాగ్యనగరానికి వచ్చాడు. సైదాబాద్‌లోని నీలం సంజీవరెడ్డి నగర్లో ఉంటున్నాడు. హమాలీగా పని చేస్తూ కుటంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే అతడి బైక్ మీద చలాన్లు పెండింగ్ ఉండటంతో మీర్ చౌక్ పోలీసులు బండిని సీజ్ చేశారు. అప్పు చేసి బండి కొన్నానని.. అన్ని చలాన్లు చెల్లించలేనని పోలీసులను వేడుకున్నాడు ఎల్లయ్య. అయినా వాళ్లు కనికరించలేదు.
కుటుబాన్ని పోషించలేని దీనస్థితిలో ఉన్న ఎల్లయ్య.. బైక్ లేకపోవడంతో పనికి వెళ్లలేని పరిస్థితి. వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడంతో మనస్థాపానికి గురయ్యాడు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఎల్లయ్య చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. చలాన్ల సొమ్ము రూ.10 వేలు కడితేనే బండి ఇస్తానని ట్రాఫిక్ ఎస్సై చెప్పాని సూసైడ్ నోట్లో రాశాడు ఎల్లయ్య. కూలీ పనులు చేసుకునే తన వద్ద అంత సొమ్ము లేదని, చెల్లించలేనని బతిమాలినా వినలేదని, టార్చర్ పెట్టారని అందులో రాశాడు. ఎల్లయ్యను వేధించిన మీర్ చౌక్ ఎస్సై గణేష్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరిట పోలీసులు ఇలా వేధించడం సరికాదంటూ మండిపడ్డారు.