ప్రస్తుతం దాంపత్య జీవితాలు చాలా వరకు సక్యత, అన్యోన్యం అనే పదాలకు సుదూరంగా సాగుతున్నాయి. మాటకు మాట అప్పజెప్పుకోవడం, ఏం చేసినా తప్పుబట్టడం అలవాటు అయిపోయింది. దానికి తోడు అనుమానం అనే పెనుభూతం ఎన్నో కాపురాలను కుప్పకూల్చింది. ఇప్పుడు అదే అనుమానంతో ఓ భర్త చేసిన ప్రవర్తన ఓ గర్భవతి ప్రాణం పోయేలా చేసింది. ఆమెను ఎంతలా హింసించాడంటే తన శవాన్ని కూడా తాకనివ్వద్దంటూ ఆమె డైరీలో రాసుకుని మరీ ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ నగరం బాలాపూర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజా మొహియుద్దీన్ అన్సారీ, షబానా బేగం దంపతుల కుమార్తె ఫిర్దోస్ అన్సారీ(29). ఆవిడ ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫతేదర్వాజకు చెందిన సుల్తాన్ పటేల్(30) అనే వ్యాపారికి ఇచ్చి వివాహం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఫిర్దోస్ కి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి.
తన భర్తకు అనుమానం అనే జబ్బు ఉందని ఫిర్దోస్ చాలా త్వరగానే తెలుసుకుంది. ఆడబిడ్డ భర్తతో మాట్లాడినా, వాళ్ల పిల్లలతో మాట్లాడినా కూడా విచక్షణారహితంగా కొట్టేవాడని తెలిపింది. ఎవరితో మాట్లాడినా అనుమానంతో బెల్టుతో కొట్టేవాడంది. అంతేకాకుండా అతని క్రూరత్వాన్ని బయటపెట్టినా పుట్టింట్లో చెప్పుకున్నా కాల్చి చంపుతానంటూ రివాల్వర్ తో బెదిరించాడంది.
ఏ దంపతులు అయినా.. గర్భవతి అయితే ఎంతో ఆనందిస్తారు. కానీ, సుల్తాన్ పటేల్ మాత్రం భార్యకు రెండుసార్లు అబార్షన్ అయితే ఆనంద పడ్డాడు. అక్కడితో ఆగకుండా చెప్పిన మాట వినకపోతే వాళ్లు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను అందరికీ చూపిస్తానంటూ బెదిరించేవాడంట. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల దగ్గరే ఉండాలంటూ హెచ్చరించి పుట్టింటికి పంపాడు.
ఈ నెల 1న అత్తగారింటికి వెళ్లిన సుల్తాన్ పటేల్ అక్కడే భార్యపై చేయి చేసుకున్నాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఇంతకాలం దాచిన భర్త నిజ స్వరూపం అతనే బట్టబయలు చేసుకున్నాడు. ఇంక ఫిర్దోస్ తల్లిదండ్రులకు జరిగింది మొత్తం చెప్పుకుని విలపించింది. తనను ఎలాగైనా రక్షించాలంటూ వేడుకుంది. దాంపత్య జీవితంలో ఇలాంటి గొడవలు సాధారణే.. మేము మాట్లాడి సర్దుబాటు చేస్తామంటూ తల్లిందండ్రులు సముదాయించారు.
ఈ తరుణంలో బుధవారం తెల్లవారుజామున ఫ్యానుకు ఉరివేసుకుని ఫిర్దోస్ ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త ఎలాంటి వాడో. తనను ఎంతలా హింసించాడో డైరీలో రాసుకుంది. తన శవాన్ని భర్త, అత్తమామలు తాకకుడా చూడాలంటూ వేడుకుంది. తల్లిదండ్రులుగా తనకోసం చేసే మేలు అదేనంటూ వాపోయింది. ఫిర్దోస్ తల్లి చేసిన ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్దోస్ భర్త మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.