మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో ఓ గుర్రం మరణించడంతో తెలంగాణలో పోలీసులు మద్రాస్ టాకీస్, గుర్రపు యజమాని నిర్వహణకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పెటా ఇండియా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు గుర్రం యజమానిపై పిసిఎ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూగ జంతువుల పట్ల క్రూరత్వంగా ఉండకూడదని ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగకూడదని, సంబంధిత దోషులకు శిక్ష పడాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారులను కోరింది. అలసిపోయి, డీహైడ్రేడ్ అయిన గుర్రాల్ని షూటింగ్‌లో ఉపయోగించడం వల్లే గుర్రం మరణించిందని గుర్రం యజమాని తెలిపారు.
జంతువులను ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించాలనీ, మనకు టెక్నాలజీ అందుబాటులో ఉందని టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్లను పెటా కోరింది. సినిమా షూటింగ్‌లో జంతువులను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా నిర్వాహకుల నిర్లక్ష్యం ఆ మూగజీవి ప్రాణాన్ని తీసింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా గుర్రాన్ని పూడ్చేసి చేతులు దులుపుకున్నారు సినిమా నిర్వాహకులు. కానీ, షూటింగ్‌లో పాల్గొన్న వారిచ్చిన సమాచారంతో పెటా ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు.
సినిమాలో యుద్ధం సీన్ కోసం 40–50 గుర్రాలను వినియోగించారు. హైదరాబాద్‌కే చెందిన ఓ గుర్రాల యజమాని దగ్గరి నుంచి గుర్రాలను తెప్పించుకున్న నిర్వాహకులు వాటితో ఏకధాటిగా షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ సమూహంలోని ఓ గుర్రం షూటింగ్ జరుగుతుండగానే డీహైడ్రేషన్ కారణంగా గత నెల 11న చనిపోయింది. చనిపోయిన గుర్రాన్ని సినిమా నిర్వాహకులు గుంత తీసి పూడ్చేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. చిత్ర నిర్మాత, గుర్రం యజమానిపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. స్థానిక పశువైద్యుడి సహకారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చనిపోయిన గుర్రానికి పోస్టుమార్టం నిర్వహించారు.