సినీ ఇండస్ట్రీ అనే కాదు మనది పురుషాధిక్య సమాజం. మహిళలు అంటే వారిని ఎదిరించకూడదు. ఇండస్ట్రీలో ఇలాంటి పోకడ ఎక్కువగా ఉంటుంది. ఈ ధోరణి కారణంగా ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ ముగిసిపోయింది. ఆ వివరాలు..
సౌత్‌లోనే కాక.. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మణిరత్నం. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కించాడు మణిర్నతం. నాయకుడు, రోజా, బొంబాయి వంటి చిత్రాలు కేవలం తమిళంలో మాత్రమే కాక తెలుగులోకి డబ్ అయ్యి భారీ విజయం సాధించాయి. ఇక మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా.. గీతాంజలి. నాగార్జున కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం గీతాంజలి. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లు చనిపోతారంటే అంగీకరించం. అయితే గీతాంజలి చిత్రం ఈ అనుమాన్నింటిని పటాపంచలు చేసింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరు త్వరలోనే చనిపోతారు.. ఆ విషయం వారిద్దరికి తెలుసు. ఇక అలాంటి ఇద్దరు యువతి, యువకుడి మధ్య చిగురించిన ప్రేమను ఎంతో అందంగా తెర మీద చూపించి.. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి.. సినిమాను సూపర్‌డూపర్ హిట్‌గా నిలబెట్టాడు మణిరత్నం. ఇలాంటి పాత్రలో నాగార్జునను చూడటానికి అభిమానులు ఒప్పుకున్నారంటే అదంతా మణిరత్నం ప్రతిభే. ఇక ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు ఓ బ్యూటీ పరిచయం అయ్యింది.. తనే గిరిజ.
గీతాంజలి చిత్రం ద్వారా గిరిజ సినీ కెరీర్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా తర్వాత గిరిజ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. తొలి సినిమాతోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. సినిమాల మీద ఆసక్తితో ఈ ఫిల్డ్‌లోకి రాలేదు. స్వతహాగా ఆమెకు భారతీయ సంస్కృతి, కళలు, ఇక్కడి తత్వశాస్త్రం, యోగా మీద ఆసక్తి. గుళ్లు తిరిగేది. పైగా గిరిజ స్వస్థలం ఇండియా కూడా కాదు. బ్రిటన్. తండ్రి కన్నడ, తల్లి బ్రిటిషర్. దాంతో ఆమెకు భారతదేశం, అరబిందో మార్గం మీద ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె మణిరత్నం-సుహాసినిల పెళ్లికి.. తెలిసిన ఫ్రెండ్ ద్వారా వెళ్లింది. అక్కడ గిరిజను చూసిన మణిరత్నం గీతాంజలి సినిమాలో యాక్ట్ చేయాలని అడిగాడు. ఆమె కూడా సరదాగా ఓ ప్రయత్నం చేద్దాం అని ఓకే చెప్పింది.
గీతాంజలి హిట్ తర్వాత గిరిజకు ఇండస్ట్రీ నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో మలయాళంలో వందనంలో నటిస్తే అది కూడా సూపర్ హిట్. దాంతో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. ఆమీర్ ఖాన్ సరసన జో జీతా వోయీ సికిందర్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు కాకుండా.. మధ్యలో ఎక్స్‌పోజింగ్ సీన్‌లు క్రియేట్ చేశారట. దాంతో గిరిజ.. వాటిల్లో నటించడానికి అంగీకరించలేదు. నిర్మాతలు బెదిరింపులకు దిగారు. దాంతో గిరిజ కోర్టును ఆశ్రయించింది. కాంట్రాక్ట్‌కు భిన్నంగా ఎక్స్‌పోజింగ్ సీన్లలో నటించమని తన మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించింది. దాంతో కోర్టు సదరు నిర్మాతకు మొట్టికాయలు వేసి.. పరిహారం చెల్లించాలని ఆదేశింశించింది.
తనను కోర్టుకు లాగిన గిరిజ మీద కక్ష పెంచుకున్న నిర్మాత.. ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆమీర్‌ఖాన్ కూడా అందుకు మద్దతు తెలిపాడు. దాంతో గిరిజ ప్లేస్‌లోకి ఆయేషా జుల్కా వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఈ చేదు అనుభవం తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి బిట్రన్ వెళ్లింది. దీని గురించి గతంలో ఆమెను ప్రశ్నిస్తే.. నేనేం బాధపడలేదు.. నేను కావాలని సినిమాల్లోకి రాలేదు కదా.. అవకాశం పోయింది అని ఎందుకు ఏడుస్తాను అని నవ్వేసింది.
బ్రిటన్ వెళ్లాక మళ్లీ తన పాత ప్రపంచంలోకి వెళ్లింది. పీహెచ్‌డీ చేసింది, ఇండియన్ ఫిలాసిఫవీ మీద వ్యాసాలు రాసింది, జర్నలిస్ట్‌గా చేసింది. మణిరత్నం, రజనీకాంత్‌ల నుంచి ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదు. అలా బాలీవుడ్ గిరిజ కెరీర్‌ను తొక్కేసింది. ప్రస్తుతం ఆమె బ్రిటన్‌లోనే సెటిల్ అయ్యింది. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ.. ప్రశాంత జీవితం గడుపుతోంది. మరి గిరిజకు ఎదురైన అనుభవం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.