మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని పిల్లలతో బడిలో చెప్పిస్తారు. అంటే తల్లి, తండ్రి తర్వాత మరో దైవం గురువే అని. బడి అంటే చదువుల నిలయం, జ్ఞానం బోధించే ఆలయం. అలాంటి ఆలయంలో దేవుడి స్థానంలో ఉండాల్సిన గురువులు కొంతమంది రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. కూతురి వయసున్న పిల్లలను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ.. పిల్లలందరూ క్లాసులు మానేసి రోడ్డు మీద బైఠాయించారు. తమని వేధిస్తున్న ప్రిన్సిపాల్ ని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కాటారం మండల కేంద్రంలో ఉన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య.. తమని వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులంతా క్లాసులు మానేసి ఆందోళనకు దిగారు. తమని ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని, అతన్ని పాఠశాల నుండి వెంటనే బదిలీ చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. విద్యార్థినులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థినులు మాత్రం.. ప్రిన్సిపాల్ ని బదిలీ చేసేంత వరకూ నిరసన కొనసాగిస్తామని పట్టుబడుతున్నారు. తమకు ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వడం లేదని.. దెబ్బలు తగిలినా సరే ఇంటికి పంపించడం లేదని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి ప్రిన్సిపాల్ తమకొద్దు అంటూ నినాదాలు చేశారు. మరి విద్యార్థినులతో జేజేలు కొట్టించుకోవాల్సిన గురువు.. ఇలా వారిని వేధింపులకు గురి చేయడంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.