మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే జీవితంలో కోలుకోలేని విషాదాన్ని నింపుతాయి. క్షణికావేశంలో అయినా, పొరపాటులో అయినా పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేక రెప్పపాటులో నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళతో పాటు ఇద్దరు పసి పిల్లలు చూస్తుండగానే రైలు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మృతులను నల్లగొండ పట్టణంలోని దేవరకొండలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు.
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి గుంటూరు జిల్లాలోని నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో వీరిని ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి రమ్య (28)తో పాటు ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక (6) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సత్తెనపల్లి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
ఇది కూడా చదవండి: Muzzafarnagar: ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదని.. అమ్మాయిపై దారుణం!
అనంతరం నల్లగొండలోని ఆమె భర్త , కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సత్తెనపల్లికి తరలివెళ్లారు. అయితే ఇది ప్రమాదమా? లేక ఆత్మహత్యనా? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.