ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో రకాల అక్రమదందాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి బంగారం ఇతర విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు.
ఈ మద్య చాలా మంది ఈజీ మనీకోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. అక్రమాయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, ఇతర దేశాల నుంచి బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులు దొంగచాటుగా స్మగ్లింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి దందాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా.. తిరిగి వచ్చి అదేపనులు కొనసాగిస్తుంటారు. ఇక హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో తరుచూ బంగారం ఇతర విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ ఆఫీసర్లకు అడ్డంగా బుక్ అవుతూ ఉన్నారు. ఇటీవల కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి బంగారు చీరను స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల శంషాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయినా కూడా స్మగ్లర్లు చిత్ర విచిత్రమైన పద్దతుల్లో బంగారం, డైమండ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్నిరకాల అరుదైన జీవాలను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు వద్ద 416 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నాడు. సదరు బంగారం విలువ సుమారు రూ.28 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
దుబాయ్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా ఓ చీరలో బంగారం స్ప్రే చేసి దాన్ని ఓ బాక్సులో భద్రపరిచి దాన్ని దాటించే ప్రయత్నం చేశాడు. సదరు ప్రయాణికుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని చీరను పరిశీలించి చూడగా అందులో బంగారం స్ప్రే చేసి ఉండటాన్ని గమనించారు. దాదాపు 416 గ్రాముల వరకు ఉంటుందని అంటున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.