అసలే చలికాలం.. చల్లటి వాతావరణం కారణంగా బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇక, చల్ల నీళ్లతో స్నానం చేసే ధైర్యం చేయటానికి కూడా జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీటర్లు, గీజర్లను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు వేడి నీటికి కాచుకునే పరికరాలను వాడుతున్నారు. ఇవే కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా, నీటిని వేడి చేసే గీజర్ ఓ కొత్త పెళ్లి కూతురి ప్రాణాలు తీసింది. స్నానం చేయటానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఆమె గ్యాస్ గీజర్ కారణంగా విగతజీవిగా మారింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మీరట్‌కు చెందిన ఓ యువతికి కొద్దిరోజుల క్రితమే పెళ్లయింది. అప్పగింతల అనంతరం అత్తారింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు స్నానం చేయటానికి బాత్‌రూములోకి వెళ్లింది. గదిలోకి వెళ్లే ముందు గీజర్‌ను ఆన్‌చేసింది. గీజర్‌లోంచి కొద్దికొద్దిగా గ్యాస్ లీకవుతూ ఉంది. కొన్ని క్షణాల్లోనే బాత్‌రూమ్ మొత్తం గ్యాస్‌తో నిండిపోయింది. ఇది గమనించని ఆమె వేడి నీళ్లు కాగిన తర్వాత లోపలికి వెళ్లింది. స్నానం చేస్తూ ఉంది. తనకు తెలియకుండానే గ్యాస్‌ను బాగా పీల్చేసింది. గ్యాస్ కారణంగా ఆమెకు ఊపిరాడక పడిపోయింది.
బాత్ రూములోకి వెళ్లిన భార్య ఎంతకీ బయటకు రాకపోవటంతో భర్త బాత్‌రూమ్ తలుపు బద్దలు కొట్టాడు. లోపల ఆమె కిందపడిపోయి ఉంది. దీంతో భర్త ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.