‘అమ్మా’ అనే పిలుపు కోసం ప్రతీ మహిళ ఆరాటపడుతుంది. అమ్మతనం తోనే స్త్రీకి పరిపూర్ణత వస్తుంది. ఇక పెళ్లి తర్వాత మతృత్వం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సమాజంలో పిల్లలు లేని స్త్రీలను ఎలా చూస్తారో మనందరికి తెలిసిందే. ఇక అత్తింటివారైతే సూటిపోటీ మాటలతో ప్రతీ రోజు నరకాన్ని చూపిస్తారు. అలాంటి నరకాన్ని తప్పించుకోవడానికే ఓ మహిళ.. మరో పేగు బంధాన్ని విడదీయాలనుకుంది. పక్కాగా ప్లాన్ వేసి బరిలోకి దిగింది. కానీ ఆమె ప్లాన్ ను పోలీసులు గంటల్లోనే ఛేదించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన రాజు, లింగాల సోనీ భార్య భర్తలు. వీరు ఉపాధి కోసం వచ్చి కవాడిగూడ లోని తాళ్లబస్తీలో ఉంటున్నారు. వీరికి పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అవుతోంది. అయినా పిల్లలు పుట్టడం లేదంటూ.. అత్తింట్లో వేధింపులు మెుదలైయ్యయి. ఆ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు తాను గర్భం దాల్చినట్లు భర్త రాజుని నమ్మించింది. ప్రసవానికి పుట్టింటికి వెళ్తున్నానని చెప్ప ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అసలు విషయం ఏంటంటే? సోని గర్భిణీయే కాదు. ఇక ఎలాగైన అబద్దాన్ని నిజం చేయాలని నిర్ణయించుకున్న సోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చింది.
ఈ క్రమంలోనే పరిసరాలు మెుత్తం గమనించి.. కర్ణాటకలోని ప్రాంతానికి చెందిన మంగమ్మ అనే మహిళతో మాట కలిపింది. ఎందుకంటే? ఆమె చేతిలో ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. మంగమ్మ టికెట్ కోసం వెళ్తూ.. బాబును సోనికి అప్పగించింది. ఆమె అటు వెళ్లగానే సోని చిన్నగా బాబుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంగమ్మ అక్కడికి వచ్చి చూడగా బాబుతో పాటు సోని కనిపించక పోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలు చూడగా.. సోని బాబుతో ఆటోలో ప్రయాణించి కవాడిగూడ చేరినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరి సోనిని అదుపులోకి తీసుకుని.. బాబును మంగమ్మకు అప్పగించారు. కేవలం 3 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించడం విశేషం. దాంతో వారిని పై అధికారులు అభినందించారు.