సూర్యాపేట జిల్లా కాసర్లపాడు తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీనునాయక్ పై ఆర్వపల్లి ఠాణాలో 2019లో హత్యకేసు నమోదైంది. హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్లపల్లి జైలులో చోటుచేసుకొంది. కుషాయిగూడ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూర్యాపేట అడిషనల్ సెషన్స్ జడ్జి 2019, సెప్టెంబరులో తీర్పు వెలువరించారు. అప్పటి నుంచి శ్రీనునాయక్ చర్లపల్లి ఇన్నర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కోడి మాంసం తీసుకురాలేదన్న కోపంతో తన తల్లిని హత్యచేసి జైలుకు వచ్చిన శ్రీనునాయక్ గత కొన్ని రోజులుగా మానసికంగా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనకు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇటీవలనే జైలుకు తీసుకొచ్చినట్లు సమాచారం.
అనారోగ్యం కారణంగా గత రెండు రోజులుగా జైలులోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బెడ్ షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీనునాయక్ కి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జైలు ఎస్కార్ట్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి 11.43 గంటల సమయంలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఎస్కార్ట్ పోలీసులు తెలిపారు. జైలర్ ధనుంజయ్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులు కూడా ఎవరూ రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు.