తన ప్రియురాలికి ఎంతో ఇష్టమైన.. ఖరీదైన స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు.. కాకపోతే షోరూం కి వెళ్లి డబ్బులు పెట్టి కొనివ్వకుండా స్మార్ట్ గా దొంగతనం చేసి ఆ గిప్ట్ ఇవ్వాలని భావించాడు ఓ యువకుడు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసినా.. చివరికి అడ్డంగా షోరూం సిబ్బందికి బుక్కయ్యాడు. ఈ ఘటన బెంగళూరులోని జేపీ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తన గర్ల్ ఫ్రెండ్ కి మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని భావించాడు అబ్దుల్ మునాఫ్ అనే యువకుడు. కానీ.. అతడి వద్ద డబ్బు మాత్రం లేదు. దీంతో మొబైల్ ఫోన్ల షోరూంలో స్మార్ట్‌ఫోన్‌ను కొట్టేసి, తన ప్రియురాలికి ఇవ్వాలని భావించాడు. ఇందుకోసం పక్కా స్కెచ్ వేశాడు.. ఈనెల 20న రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ల షాపులోకి వెళ్ళి మహిళల బాత్రూంలో దాక్కున్నాడు. అబ్దుల్ మునాఫ్ గమనించకుండ ఆ దుకాణం సిబ్బంది అన్ని తలుపులకి తాళాలు వేసి వెళ్ళిపోయారు.
రాత్రి సమయంలో మహిళల బాత్రూం నుంచి బయటకు వచ్చిన అబ్దుల్ షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మళ్ళీ మహిళల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నాడు. తెల్లరి సిబ్బంది షోరూం తెరవగానే వారి కన్నుగప్పి బయటకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. అతడు కాజేసి మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ ద్వారా అతడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇంటరాగేషన్ లో ఆ దొంగ చెప్పిన కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. మంగళూరులో ఉండే ఓ అమ్మాయితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడని, ఆమెకు గిఫ్ట్ ఇచ్చి ఆకర్షించడానికి మొబైల్ ఫోన్లు చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. అతడు చోరీ చేసిన ఫోన్ల విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక ఫోను తన ప్రియురాలికి ఇచ్చి.. మిగతా ఫోన్లు తనవద్దనే ఉంచుకున్నట్లో పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.