మూఢనమ్మకాలు మరీ మితిమీరిపోతున్నాయి. గుప్తనిధులు ఉన్నాయనే అపోహతో కొంతమంది ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. క్షుద్రపూజలు, రక్త అభిషేకాలు, నరబలి లాంటివి కూడా చేస్తున్నారు. ఇలానే గుప్త నిధులున్నాయనే ఆశతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుడిలోనే పెద్ద గొయ్యి తవ్వి, గ్రామదేవతలకు రక్తాభిషేకం చేశారు. దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. వివరాలు.. మణుగూరు మండలం మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు దుండగులు.. పూజాక్రతువులు నిర్వహించారు. ఇందులో భాగంగా ముత్యాలమ్మ విగ్రహానికి రక్తాభిషేకం చేశారు. అక్కడే పూజాసామాగ్రి, కోడిని వదిలిపెట్టారు.
గుప్త నిధుల కోసం దేవతా విగ్రహం ముందు భారీ గొయ్యి తీశారు. తెల్లవారుజామున ఆలయ పరిసరాల్లోకి వచ్చిన స్థానికులు.. అక్కడ జరిగినదానిని పరిశీలించారు. భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిసరాలను పరిశీలించారు. కాకతీయుల కాలం నాడు నిర్మించిన పురాతన ఆలయం కావడంతో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు, స్థానికులు అనుమానించారు. ఆలయంలో ఆరు అడుగుల లోతులో తవ్వకాలు జరిపారు గుప్త నిధుల ముఠా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.