దొరికిన వజ్రాలను పట్టుకుని వెళ్తే.. చెకింగ్ చేసి.. ధర ఎంత ఉంటుందో చూసి పన్నులు మినహాయించి మిగతా సొమ్ము యజమానులకు ఇస్తారు. మరి గుప్త నిధులు దొరికితే వాటి మీద హక్కు ఆ యజమానికి ఉంటుందా? ఉండదా? చట్టం ఏం చెబుతోంది?
వ్యవసాయ భూముల్లోనూ, ఖాళీ స్థలాల్లోనూ, ఇళ్లలోనూ, ఆలయాల్లో గుప్త నిధులు దొరికాయని.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న వార్తలు తరచూ వింటూ ఉంటాం. ఇటీవల ప్రకాశం జిల్లాలో గునపం బ్యాచ్ ఒకటి గుప్త నిధుల కోసం నానా హంగామా చేసింది. ఒకవేళ గుప్త నిధులు దొరికాయే అనుకోండి, పెర్ సపోజ్ దొరికాయే అనుకోండి. ఆ నిధుల మీద హక్కు ఎవరికి ఉంటుంది? స్థలంలో గానీ పొలంలో గానీ ఆ నిధులు బయటపడ్డ ప్రదేశం యొక్క యజమానికి చెందుతాయా? లేక ప్రభుత్వానికి చెందుతాయా? లేక ప్రభుత్వం కొంత తీసుకుని, యజమానికి మిగిలింది ఇస్తుందా? అసలు చట్టం ఏం చెబుతుంది? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది?
గుప్త నిధులు ఎవరికి చెందుతాయి అని తెలుసుకునే ముందు 2021 లో జరిగిన యదార్థ ఘటన గురించి తెలుసుకోవాలి. అది ఏప్రిల్ 9 2021. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఒక ప్రదేశంలో భూ యజమానులకు ఒక పాత్రలో బంగారం, వెండి, పగడాలు దొరికాయి. వాటిలో 18 తులాల 7 గ్రాముల బంగారం, 720 గ్రాముల వెండి, పగడాలు, రాగి పాత్ర దొరికాయి. వాటిని చూసిన భూమి యజమానులు అబ్బా సాయిరాం అనుకున్నారు. పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కట్ చేస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో.. ప్రభుత్వ అధికారులు గుప్త నిధులను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇదెక్కడి అన్యాయంరా బాబు అని భూ యజమానులు అనుకున్నారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి బాగా ప్రచారం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.
తమ భూమిలో దొరికిన నిధులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఏంటి? తీసుకున్న నిధులను ఏం చేస్తారు? యజమానులకు ఇచ్చేది ఉందా? కనీసం కొంచెం శాతమైనా ఇస్తారా? లేక ప్రభుత్వమే తన ఖజానాకు తీసుకెళ్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. తవ్వింది మనం, నిధులను వెలికితీసింది మనం.. అలాంటప్పుడు మనకి ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమేంటి నాన్సెన్స్ అనుకున్నా చట్టం అందుకు ఒప్పుకోదు. భూమి లోపల దొరికిన ఎలాంటి నిధిపైన అయినా సరే ప్రజలకు హక్కులు ఉండవు. అది వారసత్వ సంపద కిందకు వస్తుంది. అంటే అది ప్రభుత్వానికి చెందుతుంది. దీనికి సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధులు.. జాతి వారసత్వ సంపద అయితే.. ఆ సొత్తుపై ఎవరికీ ఎలాంటి హక్కులూ ఉండవని, ఆ నిధులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికే ఉంటుందని చట్టం చెబుతోంది.
బ్రిటిషర్లు మన దేశాన్ని పాలించిన రోజుల్లో.. దేశంలో ఉన్న ఆలయాల్లో రాజులు దాచిపెట్టిన నిధులు, నిక్షేపాలపై మొదటి నుంచి కన్ను వేశారు. ఆలయాలను ధ్వంసం చేసి దొరికినకాడికి దోచుకుపోయారు. 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ పేరిట బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నిధులు ఎవరి తవ్వి తీసుకుంటే వారికే సొంతం అంటూ బ్రిటిష్ వారు రాసిన చట్టాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత ప్రభుత్వం మార్చింది. ఈ చట్టం ప్రకారం.. ఏదైనా ఒక ప్రాంతంలో లేదా భూమిలో నిధులు లభ్యమైతే అది ఎవరికి చెందుతుంది? ఎంత వాటా చెందుతుంది? అన్న అంశంపై స్పష్టతనిస్తూ చట్టాన్ని మార్పులు చేశారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ చట్టాన్ని అమలు చేస్తోంది.
గుప్త నిధులు చారిత్రక వారసత్వ సంపదకు అంటే రాచరిక కాలానికి చెందినవి అయితే.. రాతి ముక్కలు, రత్నాలు, కుండ పెంకులు, పగడాలు ఇలా భూమిలో ఏం దొరికినా వాటిని ఆర్కియాలజీ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తారు అంటే.. అది మన పూర్వీకుల ఉనికిని కాపాడే వస్తువులు. వాటిపై పరిశోధనలు చేసి ఏ కాలానికి చెందినవో, ఆ కాలం నాటి చారిత్రక అంశాలను తెలుసుకుంటారు. గుప్త నిధులు దొరికాయని తెలియగానే స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుంటారు. నిధులకు పంచనామా చేసి కలెక్టర్ కు స్వాధీనం చేస్తారు. కలెక్టర్ వాటిని వారసత్వ సంపదా లేక పూర్వీకులు దాచి ఉంచిన సంపదా? అని నిర్ధారించిన తర్వాత పూర్వీకులదైతే వారి వారసులు ఎవరో విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు.
నిధిలో 1/5వ వంతు ఆ నిధి దొరికిన ప్రాంత యజమానికి ఇస్తారు. ఒకవేళ ఆ భూమిని యజమాని కాకుండా కౌలుదారులు సాగుచేస్తుంటే ఆ కౌలుదారులకు, నిధిని వెలికితీసిన కూలీలకు ⅕ వంతుల్లోనే కొంత వాటా ఇస్తారు. ప్రభుత్వానికి చెప్పకుండా నిధి కాజేయాలనుకుంటే జైలు శిక్ష లేదా జరిమానా తప్పవు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ పడే అవకాశం ఉంటుంది. అదండీ విషయం.. దొరికిన నిధులు రెండు రకాలు. వారసత్వంగా వచ్చిన గుప్త నిధులు అయితే వాటి మీద ప్రభుత్వానికే హక్కు ఉంటుంది. పూర్వీకులు దాచిపెట్టింది అయితే వారసులకు, తవ్విన వారికి వాటాలు పంచుతారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.